ప్రపంచంలోనే తొలిసారిగా 4కే ఓఎల్ఈడీ హెచ్డీఆర్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తీసుకురానుంది సోనీ. స్పెయిన్ బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో సోనీ ఎక్సీపీరియా-1 మోడల్ని విడుదల చేసింది సోనీ సంస్థ.
చరవాణి ఫీచర్లు
కంటిమీద పడే ఫోకస్‌ని బట్టి ఆటో ట్రాకింగ్ వ్యవస్థను ఈ ఫోనులో అనుసంధించారు. 4కే ఓఎల్ఈడీ డిస్ప్లేతో వీక్షకులకు, గేమర్స్‌కు కొత్త అనుభూతిని కలిగించనుంది. 6.5 అంగుళాల తెరతో 21:9 డిస్ప్లే దీని ప్రత్యేకత. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855ఎస్ఓసీ ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామార్థ్యం దీని సొంతం. 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో ఆకర్షిస్తుంది.
ఈ ఫోన్లో 12 మెగా పిక్సల్ సామర్థ్యంతో మూడు కెమెరాలు అనుసంధానించారు. 16ఎమ్ఎమ్ వైడ్ యాంగిల్ సెన్సార్, 16ఎమ్ఎమ్ నార్మల్ వ్యూ సెన్సార్, 52 ఎమ్ఎమ్ టెలిఫోటో లెన్స్ సెన్సార్లతో అబ్బురపరుస్తోంది. త్వరలో విపణిలోకి రానున్న ఈ చరవాణి ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
4కే ఓఎల్ఈడీ ప్రత్యేకత..
4కే యూహెచ్డీ(అల్ట్రా హై డెఫినిషన్)లో 3180, 2160 రిజల్యూషన్‌తో వీడియోలు వీక్షించవచ్చు. 8.3 మెగా పిక్సల్16:9 యాస్పెక్ట్ రేషియోతో దృశ్యాలను చూడవచ్చు. ఓఎల్ఈడీ సాంకేతికతతో విభిన్నమైన రిజల్యూషన్లలో వీక్షించడమై కాకుండా వీక్షకుడు సరికొత్త అనుభూతికి లోనవుతాడు.