బీడీలు తాగండి బాబులు.. తాగి స్వర్గాన్ని తాకండి బాబులు అంటూ తెలుగు సినిమా హీరో గొప్పగా వివరిస్తుంటాడు... స్వర్గం సంగతేమోకానీ ఒళ్లు మాత్రం నరకమవుతుంది... ఇప్పటికే క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులు వస్తున్నాయి. రోజుకి 20 కంటే ఎక్కువ సిగరెట్లు కాలిస్తే కంటి చూపుపై ప్రభావం పడుతుందని తాజా సర్వేలో తేలింది.
15 సిగరెట్ల కంటే తక్కువ కాల్చే 71 మందిని, 20 కంటే ఎక్కువ పీల్చే 63 మంది ఆరోగ్యవంతులపై సర్వే చేశారు అమెరికాకు చెందిన రూట్జర్స్ వర్సిటీ పరిశోధకులు. కంటి చూపు సరిగ్గా ఉన్న 25 నుంచి 45 మధ్య వయస్కుల వారిని ఎంచుకున్నారు.
ధూమపానం చేసినపుడు కళ్లలో కలిగే మార్పులను కాథోడ్ రే ట్యూబ్ ద్వారా పరిశీలించారు పరిశోధకులు. సిగరెట్లు కాల్చినవారికి ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు రంగులను చూడటంలో దృష్టిలోపం కలుగుతున్నట్లు గుర్తించారు.
న్యూరో టాక్సిక్ రసాయనాలు విడుదలై వర్ణాంధత్వం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పొగ అలవాటు లేనివాళ్లతో పోల్చితే ధూమాపానం అధికంగా చేసేవారిలో ఈ భేదం ఎక్కువగా కనిపిస్తోందని వాళ్లు కనుగొన్నారు.
ఈ అలవాటు మెదడు పొరల మందాన్ని తగ్గించి ఆలోచన శక్తిపైనా ప్రభావం చూపిస్తుంది. క్రమేణా మెదడు నుంచి కంటికి పంపే సంకేతాలపై ప్రభావం పడి దృష్టి కోల్పోయే ప్రమాదముందని రూట్జర్స్ వర్సిటీ డైరెక్టర్ స్టివెన్ సిల్వర్స్టెయిన్ తెలిపారు.