ఆండ్రాయిడ్ ఫోన్లో అంతర్గతంగా ఎంత మెమరీ ఉన్నా... వినియోగించే వారికి ఎప్పడూ కొరతే. సినిమాలు, వీడియోలు, ప్రోగ్రామ్ ఫైల్స్ ఇలా స్టోరేజీ సమస్యతో చాలామంది ఇబ్బంది పడతుంటారు. ఇప్పుడీ సమస్యకు పరిష్కారం తెచ్చింది సాన్డిస్క్ సంస్థ. ప్రపంచంలోనే మొదటి 1 టీబీ(టెరాబైట్) సామర్థ్యం కలిగిన మెమరీ కార్డుని అందుబాటులోకి తెచ్చింది.
స్పెయిన్లోని బార్సీలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ఈ మెమరీ కార్డుని పరిచయం చేసింది సాన్డిస్క్. స్మార్ట్ ఫోన్లు విరివిగా వాడుతున్న తరుణంలో హై రిజల్యూషన్ చిత్రాలు,వీడియోలతో మెమరీ వెంటనే నిండుకుంటుంది. ఇలాంటి సందర్భాల్లో 1టీబీ కార్డుని వినియోగించుకోవచ్చు.
సాధారణంగా ఎక్కువ సామర్థ్యం కలిగిన మెమరీ కార్డుల్లో ఫైల్ ట్రాన్స్ఫర్ వేగం తక్కువగా ఉంటుంది. కానీ ఈ మెమరీ కార్డులో 160 ఎంబీపీయస్ స్పీడుతో ఫైల్స్ పంపుకోవచ్చు. విపణిలో దొరికే మైక్రో ఎస్డీ కార్డులతో పోలిస్తే సగం సమయంలోనే డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
1 టీబీ సాన్డిస్క్ ఎక్స్ట్రీమ్ యుహెచ్ 1 ఎస్ మెమరీ కార్డుల కోసం సాన్డిస్క్ వెబ్సైట్లో ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. ఏప్రిల్లో బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి రానుందీ మెమరీ కార్డు. 1 టీబీ మెమరీ కార్డు ధర 499.99 యుఎస్ డాలర్లు(రూ.30వేలు) కాగా 512 జీబీ కార్డు ధర 199.99 యుఎస్ డాలర్లు(దాదాపు రూ.12వేలు)గా సంస్థ నిర్ణయించింది.