అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్న అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తెరదించేలా రెండు దేశాలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. మార్చి 1కన్నా ముందే రాజీ ఒప్పందం చేసుకునేలా ఇరు దేశాల ప్రతినిధులు వాషింగ్టన్లో మంతనాలు జరుపుతున్నారు. వీరి చర్చలు శుక్రవారమే ముగియాల్సి ఉంది. అయితే... ఇంకా ప్రతిష్టంభన వీడనందున ఆదివారం వరకు పొడిగించారు.
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం అంతిమ నిబంధనలపై నేరుగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని భావిస్తున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం ఫ్లోరిడా రిసార్టులో జిన్‌పింగ్‌కు వచ్చే నెలలో విందు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలపై ఈ భేటీ ఆధారపడి ఉంటుందని అన్నారు.
ఇదీ వివాదం...
2018 మార్చిలో చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న అల్యూమినియం, ఉక్కుపై అమెరికా ప్రభుత్వం భారీ సుంకాలు విధించింది. ప్రతిచర్యగా అమెరికా వస్తువులపై చైనా సుంకాలు వేసింది. అలా మొదలైన వాణిజ్య యుద్ధం... ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది.
అర్జెంటీనా జీ20 సదస్సు సందర్భంగా జరిగిన విందు సమావేశంలో జిన్‌పింగ్, ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై చర్చించారు. మార్చి 1నాటికి సమగ్ర ఒప్పందం చేసుకోవాలని గడువు నిర్ణయించారు.
ఇప్పటి వరకు 8 సార్లు చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఇరు దేశాల ప్రతినిధులు అమెరికాలో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు. వీటిలో గణనీయమైన పురోగతి కనిపిస్తే మార్చి 1 గడువును పెంచటానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ తెలిపారు.
శుభాకాంక్షలు ఫలించేనా...?
ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు జిన్‌పింగ్. చైనా నూతన సంవత్సరం సందర్భంగా... శుభాకాంక్షలు తెలియజేస్తూ డొనాల్డ్ ట్రంప్ పంపిన లేఖకు జిన్‌పింగ్‌కు ఇలా బదులిచ్చారు.