భారత్‌పై పాకిస్థాన్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. భారత్ వల్ల ప్రాంతీయ భద్రతకు విఘాతం కలుగుతోందంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి లేఖ రాశారు. అలాగే పాక్‌కు నదీజలాలు అందకుండా చేయాలనే భారత్ నిర్ణయంపైనా ఖురేషీ విమర్శలు చేశారు.
పుల్వామా దాడిపై భారత్ సరైన ఆధారాలు చూపకుండా పాక్‌ను నిందిస్తోందని ఖురేషీ ఆరోపించారు. భారత ప్రభుత్వం విధాన పరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాక్‌పై నిందలు మోపుతోందని విమర్శించారు. ఉపఖండంలో శాంతి స్థాపనకు భారత్‌తో చర్చలకు పాక్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
పాక్ మొసలి కన్నీరు..
యూఎన్ఎస్వో అధ్యక్షుడు అనటోలియో దోంగ్ మబాకు, ఖురేషీ లేఖ రాశారు.
"ఉపఖండంలో పాంత్రీయ భద్రతకు భారత్ వల్ల తీవ్ర విఘాతం కలుగుతోంది. పాకిస్థాన్‌పై దాడికి భారత్ ప్రయత్నిస్తోంది. ఇది కేవలం ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ శాంతి, భద్రతలకు చేటుచేస్తుంది. అందుకే ఐక్యరాజ్య సమితికి నేరుగా లేఖ రాస్తున్నాను." - ఖురేషీ, పాక్ విదేశాంగ మంత్రి
పాక్‌కు నదీజలాలు అందకుండా చేయాలనే భారత్ నిర్ణయాన్ని ఖురేషీ తన లేఖలో ప్రస్తావించారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు.
ఐరాసలో పాక్‌కు ఎదురుదెబ్బ
ఐరాస భద్రతామండలి పుల్వామా దాడిని ఖండించింది. జైష్ ఏ మహమ్మద్ పాక్ ఆధారిత సంస్థేనని గుర్తించింది. ఈ ఉగ్రసంస్థకు సహాయ, సహకారాలు అందించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి పాక్ మిత్రదేశమైన చైనా సైతం ఇందుకు ఆమోదం తెలపడం వల్ల దాయాది దేశానికి పుండుమీద కారం చల్లినట్టైంది. దీంతో పాక్ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి భారత్‌పై విమర్శలు గుప్పిస్తోంది.
భారత్ ఘాటు ప్రతిస్పందన
పుల్వామా ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్, పాకిస్థాన్‌ను ప్రపంచంలో ఏకాకిని చేయడానికి దౌత్యప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్‌కు ఉన్న 'అత్యంత ప్రాధాన్య దేశం' హాదాను రద్దుచేసింది. తాజాగా పాక్‌కు నీరు అందకుండా నదీ జలాల మళ్లింపు నిర్ణయం తీసుకుంది.