సరిహద్దు ప్రాంతాల్లో ఉంటోన్న తమ ప్రజలకు పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. రాత్రి వేళల్లో అనవసరంగా లైట్లు ఉపయోగించరాదని, గుంపులుగా వెళ్లొద్దని హెచ్చరించింది. నియంత్రణ రేఖ గుండా ప్రయాణించొద్దని విజ్ఞప్తి చేసింది.
'2016 - లక్షిత దాడుల'ను పరోక్షంగా ప్రస్తావిస్తూ పాక్ సైనిక స్థావరాలపై, స్థానికుల నివాసాలపై భారత్ మరోసారి దాడి చేసే అవకాశముందని ప్రకటించింది. నియంత్రణ రేఖ వద్దకు పశువులను మేతకు కూడా తీసుకువెళ్లొద్దని తెలిపింది.
భారత ప్రధాని వ్యాఖ్యలతో...
ఈ నెల 14న పుల్వామా ఉగ్రదాడిలో భారత సీఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాక్ ఆధారిత 'జైష్ ఏ మహమ్మద్' ఉగ్రవాద సంస్థ తామే బాధ్యులమని ప్రకటించుకొంది. ఈ దాడిపై ప్రతీకారానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపడుతోంది.