పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధి ప్రదర్శించింది. బహావల్పూర్లోని 'జైష్ ఏ మహమ్మద్' ప్రధాన కార్యాలయాన్ని తన నియంత్రణలోకి తీసుకున్న పాక్ ఇప్పుడు మాట మార్చింది. అది జైష్ ఏ మహమ్మద్ కార్యాలయమే కాదని బొంకుతోంది.
అధీనంలోకి తీసుకొని ...
ఉగ్రవాద ముఠాలను కట్టడి చేయాలని అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడం వల్ల పాకిస్థాన్ పుల్వామా ఉగ్రదాడికి కారణమైన 'జైష్ ఏ మహమ్మద్' ప్రధాన కార్యాలయాన్ని తన నియంత్రణలోకి తీసుకుంది. ఈ చర్యతో మసూద్ అజహర్ స్థాపించిన 'జైష్ ఏ మహమ్మద్' కార్యాలయాన్ని మొదటిసారిగా పాక్ గుర్తించినట్లు అయ్యింది.
అయితే ఈ కార్యాలయాన్ని పంజాబ్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నట్లు పాక్ సమాచారశాఖ మంత్రి ఫవాద్ చౌదరి తెలిపారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన గురువారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఫవాద్ స్పష్టం చేశారు.
పాక్ యూటర్న్...
భారత్ ఆరోపిస్తున్నట్లు, ప్రస్తుతం తమ నియంత్రణలో ఉన్నది 'జైష్ ఏ మహమ్మద్' కార్యాలయం కాదని, ఇది ఒక మదర్సా అని ఫవాద్ తెలిపారు. ఈ మదర్సాలో 70 మంది ఉపాధ్యాయులు, 600 మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు. ఈ ప్రాంగణ వ్యవహారాల నిర్వహణకు ఓ అధికారిని నియమించినట్లు తెలిపారు.
"మదర్సాలోని విద్యార్థులతో 'జైష్ ఏ మహమ్మద్' గురించి, 'మసూద్ అజహర్' గురించి అడిగాను. వారు వివరాలు వెల్లడించడానికి పూర్తిగా నిరాకరించారు. విషయం ఏమిటంటే ఏ వివరాలు చెప్పకూడదని ముందే వారిని (విద్యార్థులను) హెచ్చరించి ఉండొచ్చు."_ ఓ స్థానిక విలేకరి