పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇస్లామాబాద్ ప్రభుత్వం నడుంబిగించింది. దిల్లీ నాయకత్వంతో చర్చలు జరపడానికి 'తెహ్రీక్ ఇ ఇన్సాఫ్' (పీటీఐ) శాసనసభ్యుడు రమేశ్‌కుమార్ వంక్వానీని భారత్‌కు పంపించింది.
భారత నేతలతో భేటీ
వంక్వానీ భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మాజీ ఆర్మీ ఛీఫ్, ప్రస్తుత విదేశాంగ శాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్‌తో సమావేశమయ్యారు.
శాంతి సందేశంతో వచ్చిన తనను మోదీ సాదరంగా ఆహ్వానించారని, ఆయన సూచన మేరకు సుష్మా స్వరాజ్ తనతో భేటీ అయ్యారని వంక్వానీ తెలిపారు.
పాకిస్థాన్, భారత్‌తో ఘర్షణ కోరుకోవడంలేదని రమేశ్‌కుమార్ వంక్వానీ వెల్లడించారు. రాజకీయ ఆరోపణలు పక్కనపెట్టి, గతం నుంచి ఇరుదేశాలు పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. ఇరుదేశాలు పరస్పర విశ్వాసంతో శాంతి చర్చలు జరుపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు తాను వారధిగా నిలుస్తానని వంక్వానీ తెలిపారు.
వంక్వానీ వల్లించిన 'పాక్' నీతులు...
"నేను సుష్మా స్వరాజ్‌ను కలిశాను. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఆమెతో చెప్పాను.
పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఉంది. ఇమ్రాన్ ఒక పఠాన్. అతను చెప్పింది కచ్చితంగా చేస్తాడు. పుల్వామా ఉగ్రదాడి వెనుక పాక్ సంస్థ లేదని మేము రూఢిగా చెబుతున్నాం. భారత్ సరైన ఆధారాలు సమర్పిస్తే, మేము తప్పకుండా దర్యాప్తునకు సహకరిస్తాం.
నేను కుంభమేళాలో పవిత్ర గంగా స్నానం చేసి వచ్చాను. నేను ఎన్నడూ అబద్దాలు చెప్పలేదు. శత్రువులు పరస్పరం స్నేహం చేయడం వల్ల శత్రుత్వానికి ముగింపు పలకవచ్చు.
పాకిస్థాన్ తన భూభాగం నుంచి ఎన్నడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదు. భవిష్యత్‌లో కూడా అనుమతించదు. ఇందుకు నేను హామీ ఇస్తున్నాను. మేము భారత్‌తో ఎలాంటి ఘర్షణ కోరుకోవడంలేదు. ఇరుదేశాల మధ్య శాంతి స్థాపన జరగాలి." _రమేశ్‌కుమార్ వంక్వానీ, పీటీఐ నేత
చర్చల సంగతేంటీ?
భారత నేతలతో చర్చలు ఆశాజనకంగా సాగాయని వంక్వానీ తెలిపారు. అయితే రాజస్థాన్ ర్యాలీలో భారత ప్రధాని మోదీ పాక్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని చెప్పడం విశేషం.
ఎవరీ వంక్వానీ...
కుంభమేళాకు భారత్ ఆహ్వానించిన 185 దేశాల నుంచి వచ్చిన 220 మంది అతిథుల్లో రమేశ్‌కుమార్ వంక్వానీ ఒకరు. అధికార పీటీఐ పార్టీ సభ్యుడైన వంక్వానీ పాక్ ఆక్రమిత సింధు ప్రాంతానికి చెందిన మైనారిటీ వర్గ శాసనసభ్యుడు.
ఇదీ నేపథ్యం...
జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఫిబ్రవరి 14న 'జైషే మహమ్మద్' చేసిన ఉగ్రదాడిలో భారత సీఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది అమరులయ్యారు. ఈ ఘటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది