2008 ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని ఉగ్రసంస్థ జమాత్ ఉద్ దావా(జేయూడీ), ఈ సంస్థకు ఆర్థిక సహాయం అందించే ఫలా హీ ఇన్సానియత్ ఫౌండేషన్లపై పాకిస్థాన్ నిషేధం విధించింది. 40 మంది సీఆర్పీఎఫ్ జవానుల ప్రాణాలు బలిగొన్న పుల్వామా దాడి అనంతరం పెరుగుతోన్న అంతర్జాతీయ ఒత్తిడికి పాక్ తలొగ్గింది.
ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 2017లో సయీద్‌ను గృహ నిర్భందం నుంచి విడిచిపెట్టింది పాకిస్థాన్.
ఎల్ఈటీ మాతృసంస్థ..
జేయూడీ సంస్థకు మొత్తం 50,000 మంది వాలంటీర్లు, వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రచురణ కార్యాలయం, ఆంబులెన్స్ సర్వీసు ఉంది.
ముంబయి తాజ్ హోటల్‌పై దాడి చేసిన సంస్థ ఎల్ఈటీ. ఈ సంస్థకు జేయూడీని మాతృసంస్థగా పరిగణిస్తారు. జేయూడీను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా జూన్ 2014లో అమెరికా గుర్తించింది. దీని సారథి సయీద్‌ను ప్రత్యేక అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 2012లో హఫీజ్ గురించి సమాచారం అందించిన వారికి కోటి డాలర్ల బహుమతిని ప్రకటించింది అగ్రరాజ్యం.