పుల్వామా దాడి నిరసనగా బాలీవుడ్ ప్రముఖలు షబానా అజ్మీ, జావేద్ అక్తర్ దంపతుల నిర్ణయంపై పాకిస్థాన్ సాహితీ సమాజం విచారం వ్యక్తంచేసింది. "సాహిత్యం, కళలలో విశేష సేవలందించిన కళాకారులను గౌరవించాలని మేము అనుకున్నాం. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయరని నమ్మాం. షబానా, జావేద్ల నిర్ణయంతో మేము అసంతృప్తి చెందాం" అని పాక్ చిత్ర విమర్శకుడు ఒమైర్ అల్వీ తెలిపారు.
"ఇండో- పాక్ సంబంధాలు మెరుగు పడేలా ఆలోచించాల్సిన జావేద్ దంపతులే ఇలా చేయడం ఆశ్చర్యమేసింది. అక్తర్ వ్యాఖ్యలు విచారించేలా ఉన్నాయి. ఓ సాహితీవేత్త ఇలా వ్యాఖ్యానించడం సరికాదు" మేము వాళ్ల నిర్ణయాన్ని తప్పుపట్టడంలేదు... పుల్వామా దాడి అనతంరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని షబానా ప్రకటించడమే బాధగా అనిపించింది" అని పాకిస్థాన్ సాహితీ కళా సమాజం అధ్యక్షులు అహ్మద్ షా విచారం వ్యక్తం చేశారు.
కరాచీలో కైఫీ అజ్మీ శతవార్షికోత్సవాలకు పాకిస్థాన్ సాహితీ సమాజం జావేద్ దంపతులను ఆహ్వానించింది. ఫిబ్రవరి 23,24న జరిగే ఈ వేడుకలకు షబానా, జావేద్లు హాజరు కావాల్సి ఉంది. పుల్వామా ఘటన నేపథ్యంలో వారు ఆ ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెళ్లట్లేదని ప్రకటించారు.