పాక్ సైన్యం మరోమారు మాటమార్చింది. తమ కస్టడీలో కేవలం ఒక్క భారత పైలట్ మాత్రమే ఉన్నారని ప్రకటించింది. ఇంతకు మునుపు భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు పైలట్లు తమ అధీనంలో ఉన్నారని పాక్ సైన్యం ప్రకటించిన విషయం విదితమే.
"పాక్ ఆర్మీ అధీనంలో కేవలం ఒక్క భారత పైలట్ మాత్రమే ఉన్నారు. సైనిక నియమ నిబంధనల మేరకు వింగ్ కమాండర్ అభినందన్ మా కస్టడీలో ఉంటారు."
_మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్, పాక్ మిలిటరీ అధికార ప్రతినిధి
"నేను భారత వైమానికదళ అధికారిని. నా సర్వీస్ నెంబర్: 27981" అని భారత పైలట్ చెబుతున్నట్లు పాకిస్థాన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. కళ్లకు గంతలతో ఉన్న ఓ వ్యక్తి తనను తాను వింగ్ కమాండర్ అభినందన్గా పేర్కొన్నాడు.
ఇంతకు మునుపు గఫూర్ ఇద్దరు భారత పైలట్లను కస్టడీలోకి తీసుకున్నామని ప్రకటించారు. ఇందులో ఒకరు బాగానే ఉండగా, మరొకరు గాయపడ్డారని, అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు.
పాక్ విడుదల చేసిన మరో వీడియోలో ఓ వ్యక్తి తను ఏ మిషన్ మీద వచ్చాడో చెప్పడానికి నిరాకరించాడు. తనను ప్రజల నుంచి పాక్ ఆర్మీ కెప్టెన్ రక్షించారని, దక్షిణ భారతదేశానికి చెందినవాడినని, తనకు పెళ్ళి అయ్యిందని చెప్పాడు.
అయితే ఈ రెండు వీడియోలు ఎంత వరకు నిజమైనవో ఇంకా నిర్ధరణ కాలేదు.
భారత్ ప్రతిస్పందన..
పాక్ ఆర్మీ ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందించింది. భారత్ జరిపిన మెరుపుదాడికి ప్రతిగా పాక్ భారత భూభాగంపై దాడి జరిపిందని, దానిని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు స్పష్టం చేసింది. ఈ సమయంలో ఒక భారత పైలట్ తప్పిపోయినట్లు ప్రకటించింది. పాక్ తమ వద్ద భారత్ పైలట్ బందీగా ఉన్నాడన్న ప్రకటనను పరిశీలిస్తున్నామని విదేశాంగశాఖ తెలిపింది.