కుల్ భూషణ్ జాదవ్ కేసులో భారత వాదనలపై స్పందించింది పాకిస్థాన్. జాదవ్ వ్యాపార వేత్త కాదని, భారత నౌకాదళ అధికారని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు వాదించింది. పాక్ తరపున వాదనలు వినిపించారు కవ్వార్ ఖురేషీ.
భారత్‌కు పాకిస్థాన్ గురించి పూర్తిగా తెలియదు. ప్రపంచ శాంతి కోసం ఎంతో మంది పాక్ సైనికులు ప్రాణాలర్పించారు. జాదవ్ వ్యాపారవేత్త కాదు, భారత నౌకదళ అధికారి, గూఢచారి. భారత్ తీవ్రవాద రూపం జాదవ్.- ఖురేషీ, పాక్ న్యాయవాది.
అంతకు ముందు వాదనలు వినిపించిన భారత్ జాదవ్‌ను విడుదల చేస్తూ పాక్‌కు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. పాకిస్థాన్ సైనిక కోర్టు తీర్పు అక్రమమని ఆరోపించింది. నిన్నటి పాక్ వాదనలకు నేడు భారత్ సమాధానం ఇవ్వనుంది. రేపు పాక్ సమాధానంతో కేసులో వాదనలు ముగుస్తాయి.
ఈ వేసవిలో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెలువరించే అవకాశముంది.
కేసు వాయిదాకు ఐసీజే విముఖత:
తమ న్యాయమూర్తి అనారోగ్యంగా ఉన్న కారణంగా జాదవ్ కేసును వాయిదా వెయ్యాలన్న పాక్ అభ్యర్థనను తోసిపుచ్చింది అంతర్జాతీయ న్యాయస్థానం.