పుల్వామా ఉగ్రదాడిపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. చర్యలు తీసుకోదగ్గ ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని పేర్కొంది.
"పుల్వామా ఘటనపై సరైన ఆధారాలు అప్పగిస్తే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన మాట ప్రకారం తక్షణ చర్యలు తీసుకుంటారు. భారత ప్రధాని మోదీ శాంతికి ఒక్క అవకాశం ఇవ్వాలి."-ప్రధాన మంత్రి కార్యాలయం, పాకిస్థాన్
మోదీ హెచ్చరిక అనంతరం...
ఇటీవల రాజస్థాన్ ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించారు. గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పఠానుల పుత్రుడ్ని మాట తప్పను అంటూ ఉగ్రవాద అణచివేతపై మాట ఇచ్చి తప్పారని మోదీ ప్రస్తావించారు.
"ప్రపంచం మొత్తం ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు సిద్ధమైంది. పూర్తి సామర్థ్యంతో ఉగ్రవాదం, దానికి సాయమందిస్తోన్న దేశాలను శిక్షించడానికి ముందుకెళ్తున్నాం. ఈ సారి లెక్క సరిచేసి తీరతాం. ఇది మార్పు చెందిన భారత్, ఇక బాధను సహించదు. ఉగ్రవాదాన్ని ఎలా అణచివేయాలో మాకు తెలుసు." - నరేంద్ర మోదీ, భారత ప్రధాని
మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి స్పందించడం గమనార్హం.
అంతకంటే ఏం కావాలి..?
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత విదేశీ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది.
"జైషే మహమ్మద్ సంస్థ, దాని నాయకుడు మసూద్ అజార్ పాకిస్థాన్లో ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. పాకిస్థాన్ చర్యలు తీసుకోవడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? గతంలో ముంబయి 26/11 దాడులపై పుర్తి సాక్ష్యాలను పాక్కు ఇచ్చినప్పటికీ కేసులో ఎటువంటి చలనం లేదు. ఇది కేవలం తప్పించుకునే ప్రయత్నం మాత్రమే."- భారత విదేశీ మంత్రిత్వ శాఖ