అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రెండో దఫా చర్చలకు సిద్ధమయ్యారు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్. ఈ చర్చల్లో ఉత్తర కొరియా అణు పరీక్షల నిలిపివేతపై నిర్ణయాత్మక ప్రకటన వస్తుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. భేటీలో పాల్గొనేందుకు ట్రంప్, కిమ్‌లు వియత్నాంలోని హనోయ్ చేరుకున్నారు.
జూన్‌లో సింగపూర్ వేదికగా ట్రంప్-కిమ్ మధ్య మొదటి దశ చర్చలు జరిగాయి. అణు పరీక్షల నిలిపివేతపై నిర్ణయం తీసుకోనప్పటికీ, రెండో దఫా చర్చల్లో స్పష్టమైన ప్రకటన విడుదల చేస్తామని ఉత్తర కొరియా గతంలోనే తెలిపింది.
కిమ్ ప్రయాణం సాగిందిలా:
భేటికీ హాజరయ్యేందుకు కిమ్ రైలు ప్రయాణాన్ని ఎంచుకున్నారు. ముందుగా ఆయన వియత్నాం సరిహద్దు స్టేషన్ డోన్ డాన్ చేరుకున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా హనోయ్ వచ్చారు. సుమారు 4 వేల కిలోమీటర్లు దూరాన్ని ప్రయాణించారు కిమ్. ఇందుకు రెండున్నర రోజుల సమయం పట్టింది. ట్రంప్ అధ్యక్ష విమానంలో హనోయ్ చేరుకున్నారు.
అభివృద్ధికి సహకరిస్తాం:
ఉత్తర కొరియా అణ్వాయుధాల తయారీని నిలిపివేస్తే అభివృద్ధికి సహకరిస్తామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. రెండో దఫా చర్చల్లో కీలక ప్రకటన వచ్చే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేసింది. అణ్వాయుధాల తయారీ నిలిపివేస్తే ఉత్తరకొరియా అభివృద్ధికి రాజధానిగా మారుతుందని ట్రంప్ ట్వీట్ చేశారు. కిమ్ తెలివైన నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు.
అణు పరీక్షలను సంవత్సరం క్రితమే నిలిపి వేసినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. అయితే 1950-53 కొరియా యుద్ధ పరిస్థితులు తలెత్తకుండా మరిన్ని రక్షణ చర్యలకు హామీ ఇవ్వాలని కోరింది.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)