'ఆర్టికల్ 35-ఏ'పై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాత్రమే 'ఆర్టికల్ 35-ఏ' నిబంధనపై సరైన నిర్ణయం తీసుకోగలదని పేర్కొంది.
జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు కల్పించే రాజ్యాంగంలోని 'ఆర్టికల్ 35-ఏ'పై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో పాలనా యంత్రాంగం ఈ ప్రకటన చేసింది.
"ఆర్టికల్ 35(ఏ) పై మా వైఖరిలో ఎలాంటి మార్పులేదు. సుప్రీంకోర్టులో 'ఆర్టికల్ 35-ఏ'పై విచారణను వాయిదా వేయమని ఫిబ్రవరి 11న చేసిన అభ్యర్థనపై ఇప్పటికీ యంత్రాంగం కట్టుబడి ఉంది."_ రోహిత్ కాన్సల్, జమ్మూకశ్మీర్ గవర్నర్ అధికార ప్రతినిధి
వదంతులు నమ్మి కశ్మీర్ ప్రజలు భయాందోళనలకు గురికావద్దని రోహిత్ కాన్సల్ సూచించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ముందు జమ్మూకశ్మీర్ ప్రభుత్వ న్యాయవాది షోయబ్ ఆలమ్ తన అభ్యర్థనను వినిపించారు. ఆర్టికల్ 35(ఏ) సవాల్ చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేసిన పార్టీలకు లేఖలు రాయడానికి ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఆర్టికల్ 35(ఏ)పై విచారణను వాయిదా వేయాలని కోరారు.
పాక్ అనవసర ప్రసంగాలు..
జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే 'ఆర్టికల్ 35-ఏ'ను సవరణ చేయడం ద్వారా జమ్మూకశ్మీర్ ప్రజల హక్కులు హరించిపోతాయని పాక్ ఆరోపించింది. దీని ఫలితంగా (ముస్లిం) జనాభాలో మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొంది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అవుతుందని ఆరోపించింది.
ఏమిటీ 'ఆర్టికల్ 35-ఏ'?
'ఆర్టికల్ 35- ఏ'ను 1954 రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇది జమ్మూకశ్మీర్ స్థానిక ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు ప్రసాదిస్తుంది. ఇతర ప్రాంతాల ప్రజలు ఇక్కడి స్థిరాస్తులు ఆర్జించడానికి వీలులేకుండా నిబంధన విధించింది.
అలాగే జమ్మూకశ్మీర్‌కు చెందిన మహిళ వేరొక ప్రాంత పురుషుడిని వివాహం చేసుకుంటే ఆమెకు ఉన్న ఆస్థి హక్కులు హరించిపోతాయి. ఇది ఆమె వారసులకూ వర్తిస్తుంది. అంటే వారికీ ఎలాంటి ఆస్తి హక్కులు సంక్రమించవు.
సవాల్...
అయితే ఈ ఆర్టికల్ 35-ఏను సవాల్ చేస్తూ 'వుయ్ ది సిటిజన్స్' ఎన్జీవో సహా పలువురు సుప్రీంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ప్రతిసవాల్...
ప్రతిగా నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం పార్టీలు (ఆర్టికల్ 35-ఏ)ను సమర్థిస్తూ సుప్రీంను ఆశ్రయించాయి. జమ్మూకశ్మీర్ శాసనసభ మాత్రమే 'శాశ్వత నివాసితుల'ను నిర్వచించగలదని స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 (1)(డి) ద్వారా రాష్ట్రపతి తన అధికారం ఉపయోగించి ఆర్టికల్ 35 ఏను రాజ్యాంగంలో పొందుపరిచారని పేర్కొన్నాయి. ఇందుకు 1961, 1969 సుప్రీం తీర్పులే ఆధారమని తెలిపాయి.