'టైప్ రైటర్' ఈ మాట వింటుంటే పాతకాలంలో రిథమిక్‌గా టైపు చేసే శబ్దం లీలగా వినబడుతోంది కదూ! నేటి సాంకేతిక యుగంలో కంప్యూటర్లతోనే మన పని సులువుగా కానిచ్చేస్తున్నాం. కానీ కొన్ని దశాబ్దాల కిందట టైప్ రైటర్లు ఓ వెలుగువెలిగారు. ఏ దస్త్రాన్ని టైపు చేయాలన్నా వారి వద్దకు వెళ్లాల్సిందే.
ఏంటీ ఇది ఒకప్పటి మాట అనుకుంటున్నారా? మనకు అది ఒకప్పటి మాటే. కానీ పొరుగుదేశం మయన్మార్ అంటే ఒకప్పటి బర్మాలో ఇప్పటికీ టైపు రైటర్లు తమ హవా కొనసాగిస్తున్నారు.
ఇతని పేరు 'యు ఆంగ్ మైయంట్'. 71 ఏళ్ల ఈ మాజీ నేవీ టైపిస్ట్ మయన్మార్‌లో య్యాగన్ నగరంలో తన వృత్తిని ఇంకా కొనసాగిస్తునే ఉన్నాడు. 1980లో రిటైర్ అయినప్పటి నుంచి ఈ వృత్తినే నమ్ముకున్నాడు.
"ఒకప్పుడు నెలకు 60 నుంచి 70 నవలలు టైప్ చేసే వాడిని. ఇప్పుడు వృద్ధాప్యం వల్ల రోజుకు ఒక నవల మాత్రమే టైపు చేయగలుగుతున్నాను."_ యు ఆంగ్ మైయంట్, మాజీ నేవీ అధికారి
దశాబ్దాల మిలటరీ పాలన నుంచి విముక్తి పొందిన మయన్మార్ ప్రజలు, ఇప్పుడిప్పుడే నూతన సాంకేతికతకు అలవాటు పడుతున్నప్పటికీ ఇంకా టైపు రైటర్లను ఆదరిస్తుండడం విశేషం.
ప్రస్తుతం టైపు రైటర్లు ఒక పేజీ టైపు చేయడానికి 500 క్యాట్స్ లేదా 32 యూఎస్ సెంట్లు పొందుతున్నారు. రోజుకు సరాసరిగా 8 యూఎస్ డాలర్లు (రూ.570 సుమారుగా) సంపాదిస్తున్నారు. ఎంతో మంది ఈ వృత్తినే నమ్ముకుని గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారు.