వరుస దాడులు, చొరబాట్లు, ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి చర్చల మంత్రం వల్లెవేసింది. భారత్‌తో సంప్రదింపులకు సిద్ధమని ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో సంభాషించేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్ధంగా ఉన్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి వెల్లడించారు. ఉద్రిక్తతలు సమసిపోయేలా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందామని పిలుపునిచ్చారు.
"ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పాక్ సుముఖంగా ఉంది. భారత్ శాంతిని కోరుకుంటే అందుకు పాక్ కూడా సిద్ధమే. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ ద్వారా మాట్లాడేందుకు పాక్‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సిద్ధంగా ఉన్నారు. ఇరుదేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాక్ సిద్ధంగా ఉంది. అందుకు మోదీ సిద్ధమేనా?
పుల్వామా ఉగ్రదాడిపై కలిసి మాట్లాడుకుందాం. ఉగ్రవాదం, శాంతి దేని గురించి చర్చించేందుకైనా మేము సిద్ధం. ఈ విషయాన్ని ఉమ్మడి సవాలుగా మార్చాలనుకున్నా పాక్ సిద్ధమే."
-షా మహ్మద్ ఖురేషి, పాక్ విదేశాంగ మంత్రి