చైనాలోని ఊజెన్ వేదికగా భారత్-రష్యా-చైనా దేశాల మధ్య జరగుతున్న 16వ త్రైపాక్షిక భేటీకి భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్ హాజరయ్యారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన ఉగ్రదాడిపై సుష్మా గళం విప్పారు. సైనికులపై ఉగ్రవాదులు దాడిని పిరికిపంద చర్యగా వర్ణించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అన్ని దేశాలు కలిసి రావాలని కోరారు. బాలాకోట్ వైమానిక దాడులు ఎందుకు చేశామనే విషయాన్ని చైనా, రష్యా ప్రతినిధులకు వివరించారు.
"ప్రస్తుత ప్రపంచం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదం. ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర దేశాలు వ్యతిరేకించిన పాక్ ఆధారిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉద్రదాడికి పాల్పడింది. ఈ దాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోయాం. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరముందని చెప్పేందుకు పూల్వామా దాడి ఒక హెచ్చరిక లాంటిది. పుల్వామా దాడి అనంతరం ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా పాక్‌ను కోరినా పట్టించుకోలేదు. పైగా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థే దాడికి పాల్పడిందన్న భారత వాదనను తోసిపుచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాక్ పోరాడకపోవడం, భారత్‌లో మరో దాడికి జైషే మహమ్మద్ ప్రణాళికలు రచిస్తున్నందునే బాలాకోట్‌లో వైమానిక దాడి చేశాం. ఈ అంశాన్ని ఇక్కడితో ఆపాలని భారత్ కోరుకుంటోంది. "
-సుష్మా స్వరాజ్, భారత విదేశాంగ మంత్రి