ఎక్కువగా కూర్చుని పనిచేసేవాళ్లలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం ఎక్కువ. దీని బారిన పడకుండా ఉండాలంటే ప్రతి అరగంటకోసారి ఎంతో కొంత శారీరకంగా శ్రమిస్తే చాలంటున్నారు కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు.
ప్రతి నలుగురు యువకుల్లో ఒకరు 8 గంటల కంటే ఎక్కువ కూర్చొని ఉంటున్నట్లు నివేదికలో వెల్లడైంది.
2009 నుంచి 2013 మధ్య నలభై ఐదు సంవత్సరాలు పైబడిన 7,999 మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వారు సాధారణంగా ఉన్నప్పుడు ఏ మేరకు శారీరక శ్రమ చేశారనేది నాలుగు రోజులపాటు పరిశీలించారు. 2017లో వీరిలో ఎంత మంది మరణిస్తున్నారనే లెక్కలతో కూడిన పట్టిక రూపొందించారు. ఈ సమాచారం ద్వారా శారీరకంగా ఉత్తేజితంగా ఉన్న సమయం కంటే కూర్చున్న సమయం ఎక్కువగా ఎలా ముందస్తు మరణాలపై ప్రభావం చూపిస్తుందనేది అంచనా వేశారు.
కూర్చుని పనిచేసేవాళ్లు 30 నిమిషాలకోసారి ఏదో ఒకరకమైన శారీరక శ్రమ చేస్తే ప్రమాదంబారిన పడే అవకాశం 17 శాతం తగ్గుతుందని తేల్చారు. శారీరక శ్రమ పెరిగినకొద్దీ ప్రమాదం బారిన పడే అవకాశాలు తగ్గుతాయని వెల్లడించారు. శారీరకంగా అధికంగా శ్రమించినవారికి ప్రమాదం నుంచి మరింత ఉపశమనం లభిస్తుందని, దాదాపు 35 శాతం వరకు ప్రమాదం తగ్గే ఉందని తెలిపారు.
ఉద్యోగం నిమిత్తం ఎక్కువగా కూర్చొవాల్సి ఉన్నప్పుడు. తరచూ కదలడం,నిల్చోవటం, వీలైనంత నడవడం వంటి పనుల ద్వారా ప్రమాదాన్ని నివారించొచ్చని కొలంబియా విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు కైత్ డియాజ్ తెలిపారు.
తర్వాతి అధ్యయనాల్లో శారీరక శ్రమ చేసేవారిలో, శ్రమించని వారిలో గుండెపోటు, గుండె వైఫల్యం, హృద్రోగ సంబంధ మరణాలకు గల కారణాలపై పరిశోధన చేయనున్నట్లు తెలిపారు.