మనిషికి ఉన్న అపార శక్తి మాట్లడటం. పుట్టిన తర్వాత నేర్చుకునే మొదటి మాటలు మాతృభాషలోనే ఉంటాయి. అంతటి ప్రాధాన్యముంది అమ్మభాషకు. అలాంటి భాషను గౌరవించుకునేందుకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితిలోని విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ(యునెస్కో) నిర్ణయించింది.
ఈ రోజే ఎందుకు..
1947 ఫిబ్రవరి 21న మాతృభాష కోసం అప్పటి తూర్పు పాకిస్థాన్లో(ఇప్పటి బంగ్లాదేశ్) నలుగురు యువకులు ప్రాణాలర్పిచారు. అందుకే ఈ రోజుని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా నిర్ణయించింది యునెస్కో. మాతృభాషను రక్షిస్తేనే జీవ వైవిధ్యం కాపాడొచ్చని చెప్పింది. భాషలు అంతరించిపోకుండా సంరక్షించుకోవాలని స్పష్టం చేసింది.
ముందు మాతృభాష
ఏ భాషకు చెందినవారైనా... 30శాతం తమ మాతృభాషలో వ్యవహారానికి దూరమైతే, ఆ భాష ప్రమాదంలో పడినట్లే! తెలుగు పిల్లల్లో 40 శాతం మాతృభాషకు దూరమవుతున్నారని ఒక అంచనా. ఇతర భాషలు నేర్చుకోవాలనుకునే వారు ముందు మాతృభాషపై పట్టు సాధించి మిగతా వాటిలో ప్రతిభ చూపించొచ్చని యునెస్కో తెలిపింది.
నేను నా మాతృభాషలోనే మాట్లాడతాను. ఎందుకంటే నా ఉనికికి నా భాషే కారణం, మా అభిమాన మాతృభాషనే మా బిడ్డలకు నేర్పుతాం, వారెవరో వారికి తెలియడం వారికి అవసరం- ఇవి యునెస్కో నినాదాలు!
భాషతోనే సంస్కృతీ సౌరభం
మన మాతృభాషా స్థాయిని ఎంత పెంచుకుంటే, మన సంస్కృతి సమున్నత స్థితిలో ఉంటుంది. దీనివల్ల సమాజం అభివృద్ధి సాధిస్తుంది. ఎవరైనా తల్లి నుంచి నేర్చుకున్నంత భాష... మరే విధంగానూ నేర్చుకోలేరు.
భాషను ప్రేమించాలి..
ప్రభుత్వ సంస్థల్లో మాతృభాషే ప్రముఖం కావాలి. భాష పట్ల పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి . లేకపోతే మాతృభాషలు వెనకబడిపోతాయి. చాలా దేశాల్లో మాతృభాషలోనే విద్యాబోధన సాగుతోంది. మన దేశంలోనే ఆంగ్లభాషకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
ప్రస్తుత ప్రపంచీకరణ ప్రభావం కారణంగా, మాతృభాషలో విద్య గురించి మాట్లాడటం అనేకమందికి వింతగా అనిపించవచ్చు.
మాతృభాషకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించాలని, మనం తల్లి భాషను తప్పక ప్రేమించి తీరాలని భాషా నిపుణులు చెపుతున్నారు.