పుల్వామా దాడిపై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత రక్షణ మంత్రి నిర్శలా సీతారామన్ దీటుగా బదులిచ్చారు. భారత్ సాక్ష్యాధారాలు చూపించినా చర్యలు తీసుకోవడంలో దాయాది దేశం విఫలమైందని ఆరోపించారు.
పుల్వామా ఉగ్రదాడిలో తమ దేశ ప్రమేయముందనే ఆధారాలు ఉన్నట్లయితే, వాటిని తమకు ఇవ్వాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు. ఈ వ్యాఖ్యలపై సీతారామన్ స్పందిస్తూ
- "ముంబయి దాడుల విషయంలో గత పాక్ ప్రభుత్వానికి వరుస నివేదికలు,సాక్ష్యాలు సమర్పించాం. పాకిస్థాన్ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంది ?" అని ప్రశ్నించారు.
అయితే చట్ట ప్రకారం ముంబయి దాడుల నిందితులకు శిక్షలు విధించామని ఆమె స్పష్టం చేశారు. పాకిస్థాన్లో స్థానిక కోర్టు ఈ కనీస విధిని నిర్వర్తించలేదని ఆమె ఎద్దేవా చేశారు.
"ప్రజల్లో నెలకొన్న ఆగ్రహావేశాలు చల్లార్చడం మాటల వల్ల కాదు. ప్రధాని మోదీ ఇప్పటికే భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇలాంటి దాడులతో మా మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. భారత సైన్యానికి ప్రజా మద్దతు గొప్ప ప్రేరణ. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునారావృతం కాకుండా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భద్రతా లోపాల పై నిఘా సంస్థలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి." - నిర్మాలా సీతారామన్, రక్షణ మంత్రి
పుల్వామా దాడిపై పాక్ ప్రధాని వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించింది భారత్. తీవ్రవాదులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు లేవని పాక్ ప్రధాని ఇమ్రాన్ పేర్కొనడాన్ని తప్పు పట్టింది. శరీరంలోని నరాలకు కేంద్ర నాడీ వ్యవస్థ ఎలాగో, తీవ్రవాద సంస్థలకు పాక్ అలాంటిదని విమర్శించారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్
"పుల్వామా ఘటనను ఉగ్ర చర్యగా గుర్తించమని పాక్ ప్రధాని అనడంలో ఆశ్చర్యం లేదు. దాడికి బాధ్యత వహిస్తూ జైష్- ఏ- మహమ్మద్ చేసిన ప్రకటనను పాక్ ప్రధాని మర్చిపోయారు. ఆ సంస్థ నాయకుడు మసూద్ అజర్ పాకిస్థాన్లోనే ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. పాకిస్థాన్ చర్యలు తీసుకోవడానికి ఈ ఒక్క అంశం చాలు. ప్రపంచాన్ని పక్కదారి పట్టించడం మాని పాక్ ఉగ్రమూకలపై చర్యలు తీసుకోవాలి. పాక్ ప్రధాని తీవ్రవాదంపై చర్చలకు సిద్ధమని ప్రకటించారు. తీవ్రవాదంపై ఉమ్మడి పోరుకు సిద్ధమని భారత్ ఎప్పుడో ప్రకటించింది" - రవీష్ కుమార్, భారత్ విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి