బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 70 మంది మృతిచెందారు. చౌక్బజార్లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో ఉన్న రసాయన గోదాములో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఫైరింజన్లు, హెలికాప్టర్లతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనలో 50మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
సిలిండర్ల పేలుడు వల్లే..
చౌక్బజార్లోని రసాయన గోదాములో గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. మంటలు వేగంగా సమీప భవనాలకు వ్యాపించడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. అగ్నికీలకల్లో అనేక మంది చిక్కుకొని గాయపడ్డారు.
ప్రమాదానికి కారణమైన రసాయన గోదాముకి అగ్నిమాపక సిబ్బంది ఇంకా చేరుకోలేదు. అక్కడ మంటలు వీపరీతంగా ఎగిసిపడుతున్నాయి.