అర్జెంటీనా నేషనల్ కాంగ్రెస్ ముందు వందలాది మంది మహిళలు ఆందోళనలు చేపట్టారు. గర్భస్రావానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ప్రచార గుర్తుగా ఆకుపచ్చ రుమాలును చేతబూని నినాదాలు చేశారు.
2018లో అర్జెంటీనా సెనేట్ ఈ బిల్లును తిరస్కరించింది.
వచ్చే అక్టోబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అంశాన్ని రాజకీయ అజెండాగా తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
" గర్భస్రావాన్ని రాజకీయ అజెండాగా తీసుకురావాల్సిన సమయం ఇది. బిల్లుపై చర్చ జరగాలి. అధ్యక్ష బరిలోని అభ్యర్థులు బిల్లుపై అభిప్రాయాన్ని చెప్పాలి. మహిళలు గర్భస్రావంపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవటానికి అనుకూలమో... లేక రహస్య గర్భవిచ్ఛిత్తికి అనుకూలమో స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఏటా వందలాది మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. " - మెర్సిడెస్ త్రిమర్చి, అర్జెంటీనా వామపక్ష పార్టీ ఉపాధ్యక్షులు.
అత్యాచారానికి గురైన, మహిళ ఆరోగ్యానికి హానికరమని తెలిసిన సందర్భాల్లోనే అర్జెంటీనాలో గర్భస్రావానికి అనుమతిస్తున్నారు. ఇక్కడ ప్రతిఏటా అసురక్షిత గర్భస్రావాలతో వేల మంది మహిళలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ సమస్య మహిళల మరణాలకు ప్రధాన కారణమవుతోంది.