భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. కశ్మీర్ లోయలో ఘర్షణలు తలెత్తకుండా అమెరికా ఇరుదేశాలతో మంతనాలు జరుపుతుందని ఆయన తెలిపారు.
"ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణ వాతావరణాన్ని తగ్గించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. జవాన్లు తమ ప్రాణాలు కోల్పోయారు. దీనిని మేము ఆపాలనుకుంటున్నాం. అందుకోసం ఇరుదేశాల మధ్య చర్చల్లో మేము భాగస్వాములం అవుతాం.
భారత్ చాలా దృఢ నిశ్చయంతో ఉంది. ఉగ్రదాడిలో 40 మంది సైనికులను ఆ దేశం కోల్పోయింది. ఈ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను."_ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అమెరికా - పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపైనా ట్రంప్ స్పందించారు. గత కొద్ది నెలలుగా పాక్‌తో అమెరికా సంబంధాలు మెరుగవుతున్నాయని ట్రంప్ తెలిపారు. త్వరలోనే పాక్ నేతలతో, అధికారులతో సమావేశమై చర్చలు సాగిస్తామన్నారు.
"పాకిస్థాన్‌కు ఏటా అమెరికా చెల్లించే 1.3 బిలియన్ డాలర్ల సాయాన్ని నేను నిలిపివేశాను. దీనిపై పాకిస్థాన్ నేతలతో చర్చలు జరుపుతాను. గత అమెరికా అధ్యక్షుల హయాంలో పాక్ చాలా నిధులు పొంది లాభపడింది. అయితే అందుకు ప్రత్యుపకారంగా అమెరికాకు పాక్ ఏమీ చేయలేదు."_ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు