వెనెజువెలాలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. అమెరికా తదితర దేశాల నుంచి సాయంగా వచ్చిన ఆహార పదార్థాలు, ఔషధ సామగ్రిని వెనెజువెలాలోకి అనుమతించాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు అతని వ్యతిరేక వర్గాలకు మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో జువాన్ గైడో తనకు తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అతనికి అమెరికా సహా పలు దేశాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో వెనెజువెలాలో రాజకీయ సంక్షోభం తలెత్తింది.
సంక్షోభంలో ఉన్న వెనెజువెలాను ఆదుకోవడానికి అమెరికా తదితర దేశాలు ఆహార పదార్థాలు, ఔషధ సామగ్రిని పంపించాయి. దేశ సరిహద్దు పట్టణమైన యురేనాకు చేరుకున్న వీటిని దేశంలోకి రాకుండా అడ్డుకోవాలని అధ్యక్షుడు మదురో అధికారులను ఆదేశించారు. దేశంలో ఆహార అత్యవసర పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.
ఒక్క రాత్రిలోనే ఉద్రిక్తత
అమెరికా సాయాన్ని అనుమతించేలా ప్రజల మద్దతు కూడగట్టేందుకు బ్రిటీష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ 'వెనెజువెలా ఎయిడ్ లైవ్' పేరుతో సంగీత కార్యక్రమాన్ని యురేనా పట్టణంలో నిర్వహించారు. దీనికి పోటీగా అధ్యక్షుడు మదురో 'హ్యాండ్సాఫ్ వెనెజువెలా' కార్యక్రమాన్ని చేపట్టారు. అధ్యక్షునికి మద్దతుగా వందలాది మంది ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలకు పోటీగా నిరసనకారులు చేసిన కార్యక్రమాలు సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీశాయి.
నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించాయి.