అధ్యక్షుడు ట్రంప్‌కు అమెరికా ప్రతినిధుల సభలో ఎదురుదెబ్బ తగిలింది. మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణ నిధుల కోసం ట్రంప్ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
ట్రంప్ ఫిబ్రవరి 15న తన వీటో అధికారం ఉపయోగించి మెక్సికో గోడ నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ఎమర్జెన్సీ విధించారు. దీంతో హౌస్‌లో మెజారిటీ ఉన్న డెమోక్రాట్లు 245-182 ఓట్ల ఆధిక్యంతో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. వీరికి 13 మంది రిపబ్లికన్ సభ్యులు సైతం మద్దతు తెలపడం విశేషం.
ట్రంప్ అధ్యక్ష ఎన్నికల సమయంలో మెక్సికో సరిహద్దు గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోకి నేరస్థుల చొరబాటును, అక్రమ డ్రగ్స్ రవాణాను నిరోధించడానికి ఇది ఆవశ్యకమని తెలిపారు. అయితే గోడ నిర్మాణాన్ని డెమోక్రాట్లు వ్యతిరేకిస్తూ నిధుల మంజూరుకు ససేమిరా అంటున్నారు. హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ట్రంప్ చర్య రాజ్యాంగ వ్యతిరేకమని విమర్శించారు.
435 మంది సభ్యుల ప్రతినిధుల సభ, 100 మంది సభ్యుల సెనేట్ గోడ నిర్మాణానికి నిధుల మంజూరుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ప్రతినిధుల సభ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. సెనేట్‌లో రిపబ్లికన్లు కేవలం 53-47 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు. అధ్యక్షుని వీటోను ధిక్కరించడానికి 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది.
ట్రంప్ నేషనల్ ఎమర్జెన్సీ విధించడం వల్ల కాంగ్రెస్ గోడ నిర్మాణానికి 1.4 బిలియన్ డాలర్ల నిధులు కేటాయించింది. అయితే గోడ నిర్మాణానికి 5.7 బిలియన్ డాలర్లు కావాలని ట్రంప్ కోరుతున్నారు.