ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు, వాటి నాయకులకు అందిస్తోన్న నిధులను, ఇతర ఆర్థిక సహకారాన్ని తక్షణం స్తంభింపజేయాలని పాకిస్థాన్‌ను అమెరికా ఆదేశించింది.
అయితే పుల్వామా దాడి వెనుక పాకిస్థాన్ నాయకత్వానికి ఉన్న సంబంధాలపై అమెరికా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అలాగే 'జైష్ ఏ మహమ్మద్' స్థాపకుడు మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ డిమాండ్‌ను చైనా తోసిపుచ్చిన విషయంపైనా అగ్రరాజ్యం స్పందించలేదు.
ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూ ఉపఖండంలో రాజకీయ అస్థిరతకు పాక్ ఆధారిత 'జైష్ ఏ మహమ్మద్' కారణమౌతోందని అమెరికా అభిప్రాయపడింది. భవిష్యతులో ఈ ఉగ్రవాద సంస్థ చేసే దాడులను అడ్డుకోవడంలో పాక్‌కు పూర్తి మద్దతిస్తామని భరోసా ఇచ్చింది.
" 'జైష్ ఏ మహమ్మద్'ను 2001లోనే విదేశీ ఆధారిత ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది. ఇది ఇప్పటికీ పాకిస్థాన్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. భవిష్యత్‌లో ఈ సంస్థ ఎలాంటి ఉగ్రదాడులకు పాల్పడకుండా నిరోధించే అన్ని చర్యలకు అమెరికా మద్దతు తెలుపుతుంది."_ అమెరికా విదేశాంగ ప్రతినిధి
ఇదీ నేపథ్యం..
గురువారం జమ్ముకశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని 'జైష్ ఏ మహమ్మద్' ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ దాడిలో 40 మంది సైనికులు అమరులవ్వగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
కాగా 'ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి' 2001లోనే జైష్ ఏ మహమ్మద్, అల్ఖైదాలను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది.