మెక్సికో గోడను ఎలాగైనా కట్టి తీరుతాం అని ఎన్నోసార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు.. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అగ్రరాజ్య సరిహద్దు సమస్యకు గోడ నిర్మాణమే పరిష్కారమని చాలా సార్లు పునరుద్ఘాటించారు. గోడ నిర్మాణం వ్యయంతో కూడుకున్నదని.. వ్యర్థమైన పని అని విపక్షం వాదిస్తూ వస్తుంది.
ప్రభుత్వ పాక్షిక మూసివేత....
ట్రంప్ చర్యలతో ప్రభుత్వ పాక్షిక మూసివేతకు దారితీసింది. దాదాపు 35 రోజులు ఇది కొనసాగింది. అమెరికాలో సుదీర్ఘంగా సాగిన షట్డౌన్గా రికార్డు సృష్టించింది. డెమోక్రాట్లతోనూ చాలా సార్లు చర్చలు విఫలమయ్యాయి. ఎప్పటినుంచో ఎమర్జెన్సీ విధిస్తారనే మాటలు వినిపించినా నేడు అది నిజమైంది.
ట్రంప్ మొదటినుంచీ గోడ నిర్మాణానికి 5.6 బిలియన్ డాలర్ల నిధుల మంజూరు కోసం పట్టుబడుతున్నారు. డెమోక్రాట్లు నిరాకరించగా ప్రభుత్వ సంక్షోభం ఏర్పడింది.
అనంతరం డెమోక్రాట్లు నిధుల మంజూరుకు ఏకాభిప్రాయానికి వచ్చారు. కానీ, వారు ప్రకటించిన మొత్తం తక్కువగా ఉందని భావించిన ట్రంప్ ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు. వారు అంగీకరించిన నిధుల మొత్తం 1.4 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇది అందులో పావు భాగమైనా సరిపోదన్నారు ట్రంప్.
అత్యయిక పరిస్థితితోనైనా మెక్సికో గోడ నిర్మాణం కోసం నిధులు సమకూర్చుకోవాలని భావిస్తున్నారు ట్రంప్.