అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల భేటీ ఖరారైంది. వియత్నాంలోని హనోయ్‌లో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో ఇరువురు నేతలు ఏకాంతంగా సమావేశమవుతారని శ్వేతసౌధం గురువారం ప్రకటించింది.
ఉత్తర కొరియా అణునిరాయుధీకరణ అంశంపై ట్రంప్, కిమ్ సింగపూర్‌లో 2018 జూన్ 12న మొదటిసారి సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలించి ఉత్తర కొరియా అణ్వస్త్ర ప్రయోగాల విరమణకు అంగీకరించింది. ఈ చర్చల పురోగతిని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఇప్పుడు హనోయ్‌లో ఇరువురు నేతలు రెండో సారి భేటీ కానున్నారు.
ట్రంప్ తన విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, ఇతర కీలక అధికారులతో కలిసి హనోయ్ భేటీకి వెళ్లనున్నారు. ట్రంప్-కిమ్ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఉన్నందు వల్ల వందల సంఖ్యలో రిపోర్టర్లు సైతం వియత్నాంకు పయనమవుతున్నారు.
అయితే 'అణునిరాయుధీకరణ ఒప్పందం' విషయంలో ఇంకా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు శ్వేతసౌధం అధికారులు చెబుతున్నారు. అయితే చర్చలు ఫలిస్తాయా? లేదా ? అన్నది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. ఎందుకంటే ట్రంప్-కిమ్ మొదటి సమావేశంలో ఉత్తరకొరియా అణునిరాయుధీకరణకు ఒప్పుకున్నా, నిఘా వర్గాల సమాచారం మాత్రం అందుకు భిన్నంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
"అణునిరాయుధీకరణకు ఉత్తరకొరియా అంగీకరించినప్పటికీ, ఒప్పందానికి విరుద్ధంగా తన ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకుంటోంది. దీనిని నివారించి, ఉత్తర కొరియా 'అణు'ఒప్పందాన్ని అమలు చేసేలా చూడాలని అమెరికా ప్రయత్నిస్తోంది. అందుకే అధ్యక్షుడు ట్రంప్ ఈ అంశానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి కిమ్‌తో భేటీకి సన్నద్ధమవుతున్నారు." - శ్వేతసౌధం అధికారి