హెచ్4 వీసాదారులకు ఉద్యోగ అనుమతి విధానం రద్దు కోసం అమెరికా అంతర్గత భద్రతా శాఖ శ్వేతసౌధానికి అధికారికంగా ప్రతిపాదనలను అందించింది. ఈ మార్పులు జరిగితే 90 వేల మందికిపైగా హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములపై ప్రభావం పడనుంది. వీరిలో భారతీయ మహిళలే అధికం.
ట్రంప్ సర్కారు తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొన్ని నెలలు సమయం పట్టే అవకాశముంది. మార్పులకు కసరత్తు ముమ్మరం అయిందన్న వార్తలు వేలాది కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అసలేంటీ హెచ్-4?
హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉంటున్నవారి జీవితభాగస్వాములు ఉద్యోగం చేసేందుకు హెచ్4-ఈఏడీ నిబంధనతో అనుమతి లభిస్తుంది. బరాక్ ఒబామా హయాంలో తెచ్చిన ఈ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
- 2015 మే 26న అప్పటి బరాక్ ఒబామా ప్రభుత్వం హెచ్4-ఈఏడీ నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఐ-140 ఆమోదం పొందిన హెచ్-1బీ వీసాదారులు లేదా హెచ్-1బీకి ఆరేళ్లకన్నా ఎక్కువ పొడిగింపు పొందినవారి భాగస్వాములకు ఉద్యోగ అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
- హెచ్-1బీ ఉన్నవారందరి జీవిత భాగస్వాములకు హెచ్-4 నిబంధన వర్తించదు. ఐ-140 ఆమోదం పొంది, గ్రీన్‌కార్డ్ కోసం వేచి చూస్తున్నవారి భార్య లేదా భర్తకు మాత్రమే ఉద్యోగ అనుమతి లభిస్తుంది.
- ఐ-140 పొందితే గ్రీన్‌కార్డు కచ్చితంగా వస్తుందనే నియమం లేదు. కానీ హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు ఐ-140 ఆమోదం పొందిన తర్వాత ఉద్యోగ అనుమతి-ఈఏడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములకు ఉద్యోగ అనుమతి రద్దు చేయాలన్నది ట్రంప్ సర్కారు ఆలోచన. అందుకు తగినట్లు అమెరికా అంతర్గత భద్రతా శాఖ-డీహెచ్ఎస్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
- హెచ్-4 విధానంలో మార్పులపై శ్వేతసౌధంలోని బడ్జెట్ వ్యవహారాల విభాగం-ఓఎంబీకి డీహెచ్ఎస్ అధికారికంగా ప్రతిపాదనలు చేసింది. ఈ ముసాయిదాలో ఓఎంబీ మార్పులు చేయవచ్చు, చేయకపోవచ్చు.
- ఓఎంబీ నుంచి అందే తుది ముసాయిదాపై డీహెచ్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణ జరపనుంది. ఇందుకు సాధారణంగా 30-60 రోజుల గడువు ఉంటుంది. ఒక్కోసారి ఈ వ్యవధిని 180రోజులకు పెంచే అవకాశముంది.
- హెచ్-4 కొత్త నిబంధనవాళి ముసాయిదాపై ప్రజలు, వేర్వేరు సంస్థల నుంచి భారీ సంఖ్యలో అభిప్రాయాలు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఉన్న కేసుకు తోడు మరిన్ని వ్యాజ్యాలు దాఖలు కావచ్చు. అంటే... హెచ్-4 నిబంధనల్లో మార్పులు ఇప్పట్లో కష్టం.
- హెచ్4 వ్యవహారంపై ఇప్పటికే కొలంబియా అపీళ్ల కోర్టులో ఓ కేసు నడుస్తోంది. ఆ నిబంధనతో అమెరికన్లు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారంటూ 'సేవ్ జాబ్స్ యూఎస్ఏ' స్వచ్ఛంద సంస్థ న్యాయపోరాటం చేస్తోంది.
- డీహెచ్ఎస్ ఎలాంటి నిర్ణయం అమలుచేయాలన్నా... కోర్టుకు నివేదించి, ముందుకెళ్లాల్సి ఉంటుంది.
- టెన్నెస్సి విశ్వవిద్యాలయ పరిశోధకుల ప్రకారం హెచ్-4 ఈఏడీ ద్వారా లక్ష మంది హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు ఉద్యోగం చేస్తున్నారు. వారిలో 93శాతం మంది భారతీయ మహిళలే.