అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అత్యవసర పరిస్థితిని అడ్డుకునేందుకు డెమోక్రాట్లు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 26న ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని వారు నిర్ణయించారు. గోడ నిర్మాణం కోసం ట్రంప్ రాబట్టుకోవాలనుకుంటున్న నిధులను ఎలాగైనా అడ్డుకోవాలని నిశ్చయించారు. అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన అత్యయిక పరిస్థితి నిర్ణయం చట్టబద్ధం కాదని డెమోక్రాట్లు ఆరోపించారు.
అత్యవసర పరిస్థితిని తొలగించాలనే నిర్ణయం డెమోక్రాట్లు అధికంగా ఉన్న ప్రతినిధుల సభ దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత సెనేట్‌లో కచ్చితంగా ఓటు పద్ధతి అనుసరించాల్సి ఉంటుంది. కానీ రిపబ్లికన్లకే ఎగువసభలో మెజారిటీ ఉంది. ఎమర్జెన్సీని తప్పించాలనే డెమోక్రాట్ల నిర్ణయం సెనేట్‌లో జరిగే ఓటింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది. అయితే, తన నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు ట్రంప్.