జమ్మూలో కొవ్వొత్తుల ర్యాలీ....
జమ్ము నగరంలోని పలుచోట్ల శాంతి ర్యాలీలు నిర్వహించారు. తీవ్రవాదులను మట్టుపెట్టాలని డిమాండ్ చేశారు. ఐదు సమస్యాత్మక ప్రాంతాల్లో సైన్యం... జెండా ర్యాలీలు నిర్వహించింది.
దిల్లీ ఇండియా గేట్ వద్ద...
దిల్లీలోని ఇండియా గేట్ వద్ద పెద్దసంఖ్యలో గుమిగూడిన జనం పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్ హైకమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తీన్ మూర్తి మార్గ్, ఎయిమ్స్ సహా వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. పాకిస్థాన్ దౌత్య కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన 15మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం వదిలేశారు.
ఉత్తరప్రదేశ్‌లో...
గోరఖ్‌పుర్, బరేలీ, ఆజంఘడ్, మీరట్, కాన్పుర్, అలహాబాద్, వారణాసి సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పుల్వామా ఘటనను ఖండించారు. పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనని నినదించారు.
విలపించిన బిహార్...
పుల్వామా ఘటనలో మృతి చెందిన సంజయ్ కుమార్, రతన్ కుమార్ ఠాకూర్లు బిహార్‌కు చెందిన వారు. సైనికుల మృతిపై మౌనంగా రోదించారు బిహార్ వాసులు. పలు చోట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.
గళం విప్పిన గుజరాత్...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతృత్వంలో పాకిస్థాన్ జెండాల్ని తగులబెట్టారు. రాజ్‌కోట్‌లో తీవ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్యాజుద్దీన్ షేక్, ఇమ్రాన్ ఖేడావాలా నేతృత్వంలో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు.
బెంగాల్లో ర్యాలీలు...
పుల్వామా జవాన్ల మృతికి సంతాప సూచకంగా బెంగాల్ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. జవాన్ల మృతికి బదులు తీర్చుకోవాలని పార్టీలకతీతంగా నాయకులు డిమాండ్ చేశారు. అధికార తృణమూల్ సహా వామపక్ష పార్టీలు, వీహెచ్‌పీ నాయకులు సంతాప ర్యాలీలు నిర్వహించారు. పుల్వామా ఘటనలో అసువులు బాసిన వీరజవాన్లలో బబ్లూ సంట్రా, సుదీప్ బిశ్వాస్ పశ్చిమబంగకు చెందిన వారు. ఇద్దరు జవాన్ల కుటుంబీకులను కలిసి సానుభూతి తెలియజేశారు పలువురు నేతలు.
అసోం, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. యువత , సాధారణ పౌరులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.