దిగుమతి సుంకాల పెంపునకు గడువును మరింత పెంచామని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. చైనాతో వాణిజ్య చర్చలు కొలిక్కివచ్చిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాధ్యక్షుల మధ్య తుది దశ ఒప్పందం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2018 ప్రారంభం నుంచి చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. 250 బిలియన్ల విలువైన చైనా వస్తువులపై గతేడాది ట్రంప్ 25శాతం మేర సుంకాల్ని పెంచారు. సమాధానంగా చైనా 110 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై సుంకాల్ని అమాంతం పెంచింది.
వాణిజ్య యుద్ధంతో ఇరుదేశాలు నష్టపోతున్నాయని గ్రహించిన దేశాధ్యక్షులు ఈ ఏడాది జనవరి 1న సుంకాల పెంపును ఆపాలని నిర్ణయించారు. చైనా దిగుమతులపై మార్చి 1న 10 శాతం ఉన్న సుంకాల్ని 25 శాతానికి పెంచేందుకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చైనాతో జరుగుతున్న చర్చల్లో గణనీయ పురోగతితో సుంకాల పెంపును ఆపేందుకు నిర్ణయం తీసుకున్నారు ట్రంప్.
"మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక అవగాహన, వ్యవసాయం, సేవలు, కరెన్సీ రంగాల్లో సహకారంతో పాటు అనేక విషయాల్లో ఇరు దేశాల అధికారుల మధ్య జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించడం సంతోషంగా ఉంది. మార్చి 1న చేపట్టాల్సిన సుంకాల పెంపును వాయిదా వేస్తున్నాం"
-డోనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు