అమెరికాలో యువత ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారిని బాధకు గురిచేస్తున్న చరవాణిలే విరుగుడు మందుగా ఉపయోగపడుతుందా అని పరిశోధకులకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన పేరే ' స్మార్ట్ఫోన్ సైకియాట్రీ.'
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్... ఇవే నేటి తరం అధికంగా వినియోగించే సామాజిక మాధ్యమాలు. వీటిని ఉపయోగిస్తున్నప్పుడు వారి వేలిముద్రలు చరవాణిపై పడతాయి. ఈ వేలిముద్రల ఆధారంగా యువత మానసిక స్థితిని తెలుసుకోవడానికి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.
కృత్రిమ మేథస్సు సాయంతో తయారు చేసిన పలు యాప్లను పరిశోధకులు పరీక్షిస్తున్నారు. అవహేళన, కుటుంబ పరిస్థితులు, మరణాలు వంటి బాధ అనుభవిస్తున్న చిన్నారులు సహా 200 మంది యువతను పరీక్షిస్తున్నారు.
"పిల్లలు, యువత స్మార్ట్ఫోన్ల వాడకంలో వచ్చే మార్పులతో పలు ఆల్గొరిథంలు తయారు చేశాం. కొన్ని ప్రశ్నలకు వారిచ్చే సమాధానాలతో మానసిక స్థితిని కనుక్కొంటున్నాం. తద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో ఒత్తిడిని నివారించేందుకు పరిష్కారం తెలుసుకోవచ్చు."
--- ఐన్ గొట్లిబ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ మానసిక నిపుణుడు
పరిశోధనలో భాగంగా పాఠశాల విద్యార్థులకు యాప్ ఇచ్చి రెండువారాలకు మూడుసార్లు పలు ప్రశ్నలు అడిగారు. సమాధానాలతో వారి మానసిక స్థితిని తెలుసుకొంటున్నారు. ప్రస్తుత స్థితి కొనసాగితే భవిష్యత్తులో సమస్యలు వస్తాయా అనే అంశంపై పరిశోధనలు జరుపుతున్నారు.
"యాప్ నాకు ఎంతో నచ్చింది. చాలామంది యువత వారి భావొద్వేగాలను గుర్తించరు. ఈ యాప్ను చూసి నేను ఒత్తిడిలో ఉన్నాను... ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తారు. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇది మంచి పద్ధతి.."
--- లారెల్ ఫోస్టర్, పరిశోధనలో పాల్గొంటున్న యువతి
ఈ ప్రయోగం విజయవంతమైతే నిజ జీవితంలో ఎంతో మందికి ఈ యాప్ ఉపయోగపడుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. వీటికి తోడు స్ఫూర్తిదాయక మాటలు, సందేశాలు, తల్లిదండ్రులకు తమ పిల్లల పరిస్థితి తెలిపే ప్రయత్నం, వైద్యుల సహాయం వంటి అవసరమైన చర్యలూ ఈ యాప్లో ఉంటాయని చెప్పారు.