విమానంలో నుంచి కిందకు చూస్తే మంచి అనుభూతి కలుగుతుంది. అదే వందల మీటర్ల పైనుంచి దూకితే... మన ఆనందానికి అవధులు ఉండవు. ఆ అనుభూతి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే స్కైడైవింగ్ చేయాల్సిందే.
ప్రస్తుతం ఈజిప్టులో అంతర్జాతీయ స్కైడైవింగ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొనేందుకు 32 దేశాల నుంచి 140 మంది ఔత్సాహికులు హాజరయ్యారు. ఆకాశ వీధుల్లో చక్కర్లు కొడుతూ గిజా పిరమిడ్ల అందాల్ని వీక్షిస్తున్నారు.
"ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాత ప్రాంతాల్లో ఒకటైన గిజా పిరమిడ్ల వద్ద స్కైడైవింగ్ చేయటం నాకు జీవితకాలంలో ఒకసారి వచ్చిన అవకాశం. 27 ఏళ్లుగా స్కైడైవింగ్ చేస్తున్నాను. సుమారు 25 వేల స్కైడైవింగ్లు పూర్తి చేశాను. ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని ఈ ప్రాంతం నాకు అత్యంత గుర్తుండిపోయే ప్రాంతాల్లో ఒకటి." - ఇయాన్ హోడ్కిన్సన్, యూకే స్కైడైవర్