పుల్వామా దాడితో అప్రమత్తమైన కేంద్రం.. ఇకనుంచి బలగాల తరలింపు విధానంలో మార్పులు చేయనుంది. బస్సుల్లో అదనపు భద్రత ఏర్పాటుచేయనున్నారు. వాహనశ్రేణి వెళ్లే సమయంలో అవసరమైతే ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించే అవకాశముందని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్లో స్పష్టం చేశారు.
HR49 F0637 బస్సును ఎడమవైపు నుంచి ఎస్యూవీ వాహనం ఢీకొట్టిందని తెలిపారు అధికారులు. ఈ ఘటన 3 గంటల 33 నిమిషాలకు జరిగిందన్నారు.
పోలీసుల అదుపులో ఏడుగురు అనుమానితులు...
జమ్ముకశ్మీర్ పోలీసులు ఏడుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనశ్రేణిపై చేసిన దాడిలో వీరి హస్తం ఉందన్న అనుమానంతో పుల్వామా, అవంతిపోరాల్లో అరెస్టు చేశారు. దాడికి సంబంధించి ప్రమేయంపై వీరిని ప్రశ్నిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఘటనకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరిస్తోంది. ఇందులో ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకుంటోంది ఎన్ఐఏ. నేడు ఈ బృందాలు దర్యాప్తు చేయనున్నాయి. ఈ విశ్లేషణ పూర్తయితేనే ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు బయటికొస్తాయి.
యూపీ నుంచే 12 మంది....
ఘటనలో మృతిచెందిన జవాన్లలో 27 మంది కానిస్టేబుల్ హోదా, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఒకరిని ఏఎస్ఐలుగా గుర్తించారు.
మృతి చెందిన జవాన్లలో ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 12 మంది ఉన్నారు. రాజస్థాన్(5), పంజాబ్(4), పశ్చిమ్ బంగ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఒడిశా, తమిళనాడు, బిహార్లలో ఇద్దరు చొప్పున జవాన్లు ఉన్నారు. అసోం, కేరళ, కర్ణాటక, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఒక్కో జవాను ఉన్నారు.