నేడు జరగనున్న రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశాన్ని ఉద్దేశించి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రసంగించనున్నారు. బడ్జెట్ అనంతరం ఆర్బీఐ బోర్డు భేటీ కావటం సంప్రదాయంగా వస్తోంది.
బడ్జెట్లోని ప్రధానాంశాలను వివరించనున్నారు జైట్లీ. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రావాల్సిన డివిడెండ్‌పై చర్చ జరిగే అవకాశం ఉంది.
2018-19 సంవత్సరానికి ప్రభుత్వం రూ. 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఆశిస్తోంది. క్రితం సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ రూ. 10,000 కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.
బడ్జెట్లో ఖర్చు, ఆదాయానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని ద్రవ్యలోటు అంటారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2019-20 సంవత్సరానికి ద్రవ్య లోటు అంచనాలను ప్రభుత్వం 3.3 శాతం నుంచి 3.4 శాతానికి పెంచింది. ఈ విషయంతో పాటు పన్ను రిబేటు, రైతులకు పెట్టుబడి మద్దతు పథకం లాంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
2020-21 వరకు ద్రవ్యలోటును జీడీపీలో 3 శాతానికి తగ్గించేందుకు ప్రణాళికను తయారుచేసినట్లు బడ్జెట్లో ప్రకటించారు ఆర్థిక మంత్రి.