2019-20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్లో ప్రకటించిన ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ (పీఎంఎస్‌వైఎమ్) పథకానికి కార్మిక మంత్రిత్వ శాఖ దరఖాస్తుల స్వీరణను ప్రారంభించింది.
అర్హులెవరు..
నెలకు రూ.15,000లకు మించని ఆదాయం ఉన్న18 నుంచి 40 ఏళ్ల వయస్సున్న అసంఘటిత రంగ కార్మికులు.
దరఖాస్తు ఎక్కడ? ఎలా?
పథకానికి అర్హులైన అసంఘటిత కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్న 3.13 లక్షల సాధారణ సేవా కేంద్రాల్లో (సీఎస్సీ) పేర్లు నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్, ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రత్యేక వాహనాలు దేశ వ్యాప్తంగా ఈ నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.
అర్హులు... ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం లేదా జన్ ధన్ ఖాతా పుస్తకంతో సమీప సీఎస్సీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు.
త్వరలోనే మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నట్టు కార్మిక శాఖ పేర్కొంది. దరఖాస్తు పూర్తయిన వారికి ప్రత్యక గుర్తింపుతో కూడిన రశీదును ఇస్తారు.
దరఖాస్తుదారు జాతీయ పింఛన్ పథకం, రాష్ట్ర బీమా సంస్థ, ఉద్యోగుల భవిష్య నిధి పరిధిలో ఉంటే ఈ పథకానికి అర్హులు కారు.
పథకం అమలు ఎలా..
పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు వయస్సు ప్రకారం నెలసరి చందాలు చెల్లించాల్సి ఉంటుంది.
వయస్సు | నెలసరి చందా | వయస్సు | నెలసరి చందా |
18 | రూ.55 | 30 | రూ.105 |
19 | రూ.58 | 30 | రూ.110 |
20 | రూ.61 | 32 | రూ.120 |
21 | రూ.64 | 33 | రూ.130 |
22 | రూ.68 | 34 | రూ.140 |
23 | రూ.72 | 35 | రూ.150 |
24 | రూ.76 | 36 | రూ.160 |
25 | రూ.80 | 37 | రూ.170 |
26 | రూ.85 | 38 | రూ.180 |
27 | రూ.90 | 39 | రూ.190 |
28 | రూ.95 | 40 | రూ.200 |
29 | రూ.100 |
దరఖాస్తు దారు చెల్లించిన అంతే మొత్తంలో ప్రభుత్వం నెలసరి ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఇలా జమ చేసిన వారు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3,000 పింఛను పొందుతారు. దరఖాస్తు సమయంలో మొదటి నెల చందాను నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
పథకం లక్ష్యాలు
ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది శ్రామికులకు ఈ పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.