భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. కొన్ని నెలల్లో భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రపంచ ఆర్థిక సూచీలు బలహీనంగా ఉన్నాయి. స్టాక్ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. ఇలాంటి సమయాల్లో యుద్ధం వస్తే మీ పెట్టుబడులను ఏం చేయాలి?
ప్రస్తుతానికి మీ పెట్టుబడులన్నింటినీ ఉపసంహరించుకుని అస్థిరత్వాలన్నీ తొలిగేంతవరకు వేచి ఉండాలా? కొంత భాగాన్ని మాత్రమే వెనక్కి తీసుకోవాలా?
యుద్ధ పరిణామాలు:
యుద్ధం వస్తే ఆ ప్రభావం ద్రవ్యంపై ఎలా ఉంటుందనే అంశంపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ఇప్పటివరకు జరిగిన యుద్ధాలపరంగా చూస్తే... పన్నులు, ద్రవ్యోల్బణం, ప్రజా రుణం పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల క్షీణత, సైనిక వ్యయం పెరగటం, సైనికేతర అంశాల కన్నా అధికంగా రక్షణ సంబంధిత ఉత్పాదన ఉంటుంది.
ద్రవ్యోల్బణం ద్రవ్య విలువను హరింపజేస్తుంది. ఇలాంటి సమయాల్లో మీ ఆస్తులను మారకం రూపంలోకి మార్చటం సరైందికాదు. మీ పెట్టుబడిలో ప్రమాదం ఉందనుకున్న పోర్ట్‌ఫోలియోను మీరు గుర్తిస్తే తదనంతర చర్యలు తీసుకోవాలి. అలా అయితే తీవ్ర నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది.
నష్టాల పోర్ట్‌ఫోలియో నుంచి పెట్టుబడుల ఉపసంహరణ
సంక్షోభాలకు స్టాక్ మార్కెట్లు తొందరగా ప్రభావితమవుతాయి. అమ్మకాలు పెరుగుతాయి. మ్యూచువల్ ఫండ్ల విలువ తగ్గుతుంది.
ఇప్పట్లో భారత్ యుద్ధాల జోలికి వెళ్లకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా... దేశీయ మార్కెట్లు ప్రభావితమవుతాయి. ఇలాంటి సమయాల్లో అత్యధికంగా నష్టాలొచ్చే పోర్ట్‌ఫోలియోలో పెట్టుబడులను తగ్గించుకోవటం మేలు.
ప్రభావితమయ్యేవి...
లార్జ్ క్యాప్ షేర్లతో పోలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లకు రిస్క్ ఎక్కువ. కార్పొరేట్ బాండ్లు, డిపాజిట్లు అధికంగా ప్రభావితమయ్యేవే. అత్యధిక రేటింగ్ ఉన్న కార్పొరేట్ల అప్పులు కూడా వీటికి సవాలుగా మారొచ్చు.
బంగారం కొనుగోలు మంచిదేనా?
అనిశ్చిత సమయాల్లో బంగారంపై మదుపు చేసేందుకే మొగ్గు చూపుతారు. అయితే ఈ విషయంలో జాగ్రత్త అవసరం. మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా 5 శాతానికి మించకుండా చూసుకోవాలి.
ప్రభుత్వ బాండ్లు, చిన్న తరహా పొదుపు పథకాల్లో మదుపు చేయటం ద్వారా కచ్చితమైన రాబడితో పాటు, మూలధనానికి రక్షణ ఉంటుంది.
అత్యాశ ప్రమాదం
మార్కెట్లలో అనిశ్చితి ఉన్నా, యుద్ధాలు జరుగుతున్నా... పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉంటాయి. ఎలాంటి సమయాల్లోనైనా తెలివైన పెట్టుబడిదారు లక్ష్యాలపై దృష్టిసారిస్తాడు. ఆయితే ఈ సమయంలో మదుపరులు అత్యాశకు లోనై, అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకునేందుకు ప్రయత్నిస్తే అధిక ప్రమాదాలకు దారితీయొచ్చు.