ఆపిల్ మడతపెట్టే ఫోన్లను తయారు చేయోచ్చంటూ టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనంతటికీ కారణం ఆ చరవాణి తయారీ, నమూనాను పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడమే. ఇప్పటికే ఈ జాబితాలో శాంసంగ్, హువావే, జియోమీ సంస్థలు చేరాయి. ఈ ఏడాది ఆ సంస్థలు ఈ ఫీచర్ మొబైల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి.
ఫిబ్రవరి 14న అమెరికా పేటెంట్, ట్రేడ్‌మార్క్ ఆఫీసులో ఈ తయారీపై హక్కుల కోసం ఆపిల్ దరఖాస్తు చేసింది. దీనికి చిన్న పాటి వీడియో నమూనాను జతచేసిందట.
ఏం లాభం...?
ఈ ఫీచర్‌తో చిన్న పరికరంలోనే పెద్ద స్క్రీన్ అమర్చొచ్చు. పెద్ద డిస్ప్లే ఫోన్లను అరచేతిలో పట్టేలా రూపొందిస్తారు. మడతపెట్టినపుడు మన కంటికి కనిపించే భాగమే పనిచేస్తుంది. మిగతా సగం ఆఫ్ అవుతుంది. ఐపాడ్లను ఐఫోన్ సైజులో చూడొచ్చన్న మాట.
పేటెంట్ ఎందుకు?
సాధారణంగా ఫోన్లు తయారీకి సిద్ధమయ్యే ముందే పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటాయి కంపెనీలు. ఎందుకంటే మిగతా సంస్థలు ఆ ప్లాన్‌ను కాపీ కొట్టకుండా. ఆపిల్ సంస్థ ఈ ప్రొడక్ట్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నది ముందు జాగ్రత్త కోసమే అంటూ కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫోన్ విడుదలయ్యే వరకు ఎదురుచూపులు చూడాల్సిందే అంటున్నారు.
ఇప్పటికే చరవాణి సంస్థలు వీటిని మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతుండగా... ఆపిల్ సైతం ఇదే బాటలో ప్రయాణించడం టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది.