భారత్-పాక్ ఉద్రిక్తతలు,అంతర్జాతీయ పరిణామాలతో గత రెండు రోజులుగా నష్టాల్లో ఉన్న సూచీలు నేడు లాభాల బాట పట్టాయి. ఫిబ్రవరిలో డెరివేటివ్ కాంట్రాక్ట్ ముగింపు సందర్భంగా దేశీయ మదుపరులతో పాటు విదేశీయులు భారీ కొనుగోళ్లు చేపట్టినందున మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
డెరివెటివ్ కాంట్రాక్ట్ అంటే..?
ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం కొంత గడువు తర్వాత సొమ్ము చెల్లించడాన్ని డెరివెటివ్ కాంట్రాక్ట్ అంటారు.
ఉదాహరణకు డిసెంబర్లో కొనుగోలు చేసి ఫిబ్రవరిలో సొమ్ము చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవడం.
లాభాల్లోనే..
170 పాయింట్ల వృద్ధితో ప్రారంభమైన సెన్సెక్స్ ప్రస్తుతం 73 పాయింట్ల లాభంతో 35,978 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ కూడా అదే బాటలో 18పాయింట్ల లాభంతో 10,825 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో ఉన్నవి:
కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, బ్యాంకింగ్ రంగ షేర్లు.
భారీ లాభాలు ఉండకపోవచ్చు:
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్ నుంచి భారీ లాభాలు ఆశించలేమని సన్‌ఫార్మా ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి త్వరలో జరగబోయే స్వార్వత్రిక ఎన్నికలు కూడా తోడైనందున కొంత కాలం ఇదే పరిస్థితి ఉంటుందని ఆయన తెలిపారు.
ఈరోజు విడుదల కానున్న జీడీపీ, ద్రవ్యలోటు లెక్కలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి:
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ముగింపుపై స్పష్టమైన ప్రకటన రాకపోవటంతో ఆసియా మార్కెట్లు సహా అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.