భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో టాప్-10లో నిలిచారు. 54 బిలియన్ డాలర్ల(రూ.3.38లక్షల కోట్ల) సంపదతో ఆయన పదోస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ది హురూన్ గ్లోబల్ రిచ్ జాబితా-2019 వెల్లడైంది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 147 బిలియన్ డాలర్ల సంపదతోవరుసగా ప్రపంచ ధనికుడిగా రెండో ఏడాదీ నిలిచారు. 96 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రెండో స్థానంలో ఉన్నారు.
మార్కెట్లో లాభాలతో..
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గత నెలలాభాలను ఆర్జించాయి. మొత్తం ఆ సంస్థ విలువ 8లక్షల కోట్లను చేరింది. వాటిలో ముఖేశ్‌కు సుమారు 52శాతం పైగా వాటా ఉంది. దీంతో ఆయన సంపద రూ.3.38లక్షల కోట్లకు చేరింది. ప్రపంచ కుబేరుల జాబితాలో పదో స్థానానికి చేరుకున్నారు.
అనిల్ పరిస్థితి భిన్నం
ముఖేశ్ అంబానీ నానాటికీ తన సంపదను పెంచుకుంటూ దూసుకెళుతుంటే... ఆయన సోదరుడు అనిల్ అంబానీ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయన సంపద కరిగిపోతోంది. ఏడేళ్ల క్రితం 7 బిలియన్ డాలర్లు ఉన్న ఆయన సంపద... ఇప్పుడు 1.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. తాజాగా ఎరిక్సన్ సంస్థకు రూ.540కోట్లు చెల్లించాలని సుప్రీం ఆయన నేతృత్వంలోని ఆర్‌కామ్‌ను ఆదేశించింది. కోర్టు ధిక్కరణ చేశారని మందలించింది.
ముఖేశ్ తర్వాతి భారతీయులు వీరే..
భారత్‌లో అత్యంత ధనికుడు ముఖేశ్. ఆ తర్వాతి స్థానంలో 21 బిలియన్ డాలర్లతో హిందూజ గ్రూపుల చైర్మన్ ఎస్.పి.హిందూజ ఉన్నారు. 17 బిలియన్ డాలర్ల సంపదతో విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ మూడో స్థానం నిలిచారు.
100లోకి పూనవల్లా
13 బిలియన్ డాలర్ల సంపదతో పూనవల్ల గ్రూప్ చైర్మన్ సైరస్ ఎస్.పూనవల్ల భారత అత్యంత ధనికుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. అంతేకాక, ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-100లోకి ప్రవేశించారు.
భారత కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో లక్ష్మీమిట్టల్, ఆ తర్వాతి స్థానాల్లో ఉదయ్ కొటాక్, గౌతమ్ అదానీ, సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ ఉన్నారు.