ఆరంభంలో జోరుమీదున్న స్టాక్ మార్కెట్లు భారత్-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ భయాల కారణంగా నష్టాలతో ముగిశాయి.
బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 68.28 పాయింట్లు కోల్పోయి 35,905.43 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 28.65 పాయింట్లు నష్టపోయి 10,806.65 వద్ద స్థిర పడింది.
ఇదీ కారణం
పాకిస్థానీ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొరబడడం కారణంగా దేశ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో మదుపరులు అధికంగా అమ్మకాల వైపు మొగ్గు చూపారు.
గడిచిన సెషన్లలో వచ్చిన విదేశీ సంస్థల పెట్టుబడులు సైతం ఇవే భయాలతో తగ్గు ముఖం పట్టాయి. మిడ్ సెషన్లో భారీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు సెషన్ ముగిసే సమయానికి కాస్త కోలుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా
లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ 36,371.11 పాయింట్ల వద్ద గరిష్ఠ స్థాయికి ఎగబాకగా ఓ దశలో 35,735.33తో కనిష్ఠ స్థాయిని నమోదుచేసింది.
నిఫ్టీ అత్యధికంగా 10,939.70 పాయింట్ల వద్ద గరిష్ఠస్థాయిని చేరుకొని, ఆమ్మకాల ఒత్తిడి కారణంగా 10,751.20 పాయింట్లకు పడిపోయింది.
లాభానష్టాల్లోనివివే....
టాటా మోటార్స్ అత్యధికంగా 3.01 శాతం నష్టాన్ని నమోదుచేయగా, ఆ తర్వాతి స్థానంలో 2.92 శాతం నష్టంతో వేదాంత నిలిచింది. హెచ్‌యూఎల్, కొటక్ బ్యాంకు, ఎన్టీపీసీలు 1.77 శాతం మేర నష్టపోయాయి.
భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఆటో, ఎల్ & టీ, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంకుల షేర్లు 2.53 శాతం లాభాలను నమోదు చేశాయి.
రూపాయి
రూపాయి 25 పైసలు పతనమైంది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 71.32 వద్ద ఉంది.