50 ఏళ్ల పాటు అయిదు విమానాశ్రయాల నిర్వహణ కాంట్రాక్టును చేజిక్కించుకుంది ప్రైవేటు దిగ్గజం అదానీ గ్రూప్. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాతిపధికన భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ(ఏఏఐ)అధీనంలోని ఆరు విమానాశ్రయాలను నిర్వహించే ప్రతిపాదనను గతేడాది నవంబర్లో ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. వాటిలోని అహ్మదాబాద్, జైపూర్, లక్నో, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాల బాధ్యతలను సొంతం చేసుకుంది అదానీ. గుహవటి విమానాశ్రయ బిడ్లను నేడు తెరవనున్నారు.
రుసుము ఆధారంగా..
ఒక్కో ప్రయాణికుడిపై చెల్లించే రుసుము ఆధారంగా దాఖలు చేసిన బిడ్ల ద్వారా సంస్థను ఎంపిక చేసిందిఏఏఐ. అధిక ధరలకు బిడ్లు వేసిన అదానీ... విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను సొంతం చేసుకుంది.
అహ్మదాబాద్, జైపూర్, లక్నో, తిరువనంతపురం, మంగళూరులకు ఒక్కో ప్రయాణికుడికి వరుసగా రూ.177, రూ.174, రూ.171, రూ.168, రూ.115 చొప్పున బిడ్లను దాఖలు చేసింది అదానీ. ఈ మొత్తాన్ని ఏఏఐకు చెల్లించనుంది ఆ సంస్థ.
హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలను నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ ఇవే విమానాశ్రయాలకు వరుసగా రూ. 85, రూ. 69, రూ. 63, రూ. 63, రూ. 18 బిడ్లను దాఖలు చేసింది.
ఆరు విమానాశ్రయాల నిర్వహణకు 10 సంస్థలు మొత్తం 32 బిడ్లను దాఖలు చేశాయి.