కచ్చితమైన సమాచారం తెలియకపోవడం, ప్రైవేటు పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, సీట్ల లభ్యతకు దరఖాస్తుల నమోదుకు మధ్య వ్యత్యాసం వంటి అంశాలు విద్యా హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడానికి ప్రధాన కారణాలని ఓ నివేదిక వెల్లడించింది.
2009లో ప్రవేశ పెట్టిన విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1)(సి) నిబంధన ప్రకారం పిల్లలందరికీ స్వేచ్ఛ, కచ్చితమైన విద్యను కల్పించాలి. దీనిని అమలు చేసేందుకు ప్రైవేటు, ఎయిడెడ్, నాన్ మైనారిటీ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన, దివ్యాంగ విద్యార్థులకు కేటాయించారు.
విద్యాహక్కు చట్టం అమలుపై ఓ స్వచ్ఛంద సంస్థ 'బ్రైట్ స్పాట్స్: స్టేటస్ ఆఫ్ సోషల్ ఇన్క్లూషన్ త్రూ ఆర్టీఈ' పేరుతో 10వేల మందితో సర్వే నిర్వహించింది.
కొన్ని రాష్ట్రాల్లోని పాఠశాలలు సీట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ సదుపాయం కల్పించాయి. మిగతా రాష్ట్రాల్లో వీటిపై అవగాహన భిన్నంగా ఉంది.
ఎన్ని సీట్లకు ఎన్ని దరఖాస్తులు నమోదవుతున్నాయని సర్వేలో విశ్లేషించారు. ఒక్కో సీటుకు నమోదైన దరఖాస్తుల ఆధారంగా తల్లితండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్చేందుకు ఆసక్తిని కనుబరుస్తున్నారా లేదా అని నిర్ణయించారు.
కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు తక్కువగా ఉండటం, దరఖాస్తులు ఆహ్వానించకపోవడం వంటి కారణాలతో తల్లితండ్రులు ఆసక్తి కనబర్చక సీట్లు ఖాలీగా మిగిలిపోతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.
దివ్యాంగ విద్యార్థులకు పాఠశాల ప్రవేశానికి ముందు నుంచి ప్రవేశం పొందిన అనంతరమూ ప్రభుత్వం తరఫున సాహాయక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముందని నివేదిక తెలిపింది.
విద్యార్థుల పాఠశాల ప్రవేశాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించలేదు. కొన్ని రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన వివరాల జాబితా సిద్ధం చేయాల్సి ఉంది.
పీవీఆర్ నెస్ట్ సహకారంతో ఇండస్ యాక్షన్ ఈ నివేదికను గురువారం విడుదల చేసింది. 'సోషల్ ఇన్క్లూషన్ ' అనే చర్చా కార్యక్రమం నిర్వహించి సలహాలు సూచనలు తెలియజేశారు. విద్యాహక్కు చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు 'ప్రాజెక్ట్ ఏకలవ్య' కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు.
సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రచారం ముమ్మరం చేసి దేశంలోని పిల్లలందరికీ విద్యను మరింత చేరువ చేసి విద్యాహక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అములు చేసేందుకే ఈ కార్యక్రమం. దీని కోసం ప్రత్యేక యాప్ను రూపొందించారు.