హిమాచల్ ప్రదేశ్ కుల్లూ జిల్లాలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. గాంధీనగర్లో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కొండ చరియలు రహదారులపై విరిగిపడుతున్నాయి. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. సంజ్ లారిజీ రోడ్డులో ఓ జీపు కూరుకుపోయింది. అధికారులు జేసీబీతో బయటకు తీశారు.
బురదతో ప్రమాదకరంగా మారిన భుంటార్-కుల్లూ రోడ్డు మార్గాన్ని అధికారులు మూసివేశారు. వర్షాలు భారీగా కురుస్తున్నందున కుల్లూ జిల్లాలోని విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు అధికారులు.
సహాయక చర్యలకు ఆటంకం!
హిమాచల్ ప్రదేశ్ కినౌర్ జిల్లా 'షిప్కీ లా' సరిహద్దులో వర్షంతో పాటు మంచు భారీగా కురుస్తోంది. ఫలితంగా బుధవారం మంచు చరియల్లో చిక్కుకున్న ఐదుగురు జవాన్ల కోసం చేపట్టిన సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది.
" కినౌర్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి వర్షం కురిస్తోంది. హిమపాతం కూడా భారీగా నమోదైంది. ఘటనా ప్రాంతంలో ఉదయం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. అయినా... సహాయక చర్యల కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాం"
- మమతా నేగి, కినౌర్ జిల్లా ప్రజా సంబంధాల అధికారి
బుధవారం ఉదయం 11 గంటల సమయంలో భారత్-చైనా సరిహద్దులోని షిప్కీ లా ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడ్డాయి. 7 జేకే రైఫిల్స్ దళానికి చెందిన ఆరుగురు జవాన్లు ఈ ప్రమాదానికి గురయ్యారు. బుధవారమే ఒక జవాను మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. మరో ఐదుగురి జాడ లభించలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జవాన్లు ఇంకా జీవించి ఉండే అవకాశాలు తక్కువేనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.