జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం చేయాలని చూస్తోందని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఆరోపించారు. పాక్ ఒకప్పటిలా లేదని తమపై యుద్ధం చేయాలన్న ఆలోచన కూడా భారత్ చేయకూడదని ఖురేషీ హెచ్చరించారు. భారత్-పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపుచేసేలా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కోరారు.
"పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోంది. కానీ, భారత్ యుద్ధ పరిణామాలు సృష్టిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. మా దేశంపై ఒత్తిడి పెంచి ఆధిపత్యం చెలాయించాలన్న భావనను భారత్ విరమించుకోవాలి. ఎందుకంటే పాక్ పిడికిలి బిగించిన చేయి లాంటిది. పాక్‌ను అంతం చేయాలన్న ఆలోచన చేయకండి. ఇస్లామాబాద్‌పై దిల్లీ తన వైఖరిని మార్చుకోవాలి. జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది దేనికి సంకేతం? "
- షా మహమూద్ ఖురేషీ, పాక్ విదేశాంగ శాఖ మంత్రి