గగనతలంలో వరుస చొరబాట్లు, ఉదయం నుంచి కాల్పుల మోతతో నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులు వేడెక్కాయి. రెండు దేశాలకు చెందిన ఫైటర్ జెట్లు కూలిపోవడం ఆందోళనలను మరింత పెంచాయి. ఫలితంగా సాధారణ పౌరుల భద్రతకు చర్యలు ప్రారంభించాయి ఇరు దేశాలు. నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న నగరాల్లోని విమానాశ్రయాలను మూసివేశాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య గగనతలంలో ప్రయాణిస్తున్న విమానాలపైనా ఈ ప్రభావం పడింది. వీలైన సర్వీసులను వెనక్కి రప్పించారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.
పౌరుల భద్రతే లక్ష్యంగా
భారత్‌లో శ్రీనగర్, జమ్ము, లేహ్, అమృత్సర్, చంఢీగడ్ విమానాశ్రయాలను మూసివేశారు. జమ్ము, లేహ్, శ్రీనగర్‌కు బయల్దేరిన సర్వీసులను వెనక్కు పంపించారు. దెహ్రాదూన్లోనూ తాత్కాలికంగా సేవలు నిలిపివేశారు. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
పాకిస్థాన్‌లో పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రాల్లోని ఐదు ప్రధాన నగరాల్లో భద్రతా చర్యలకు ఉపక్రమించింది ఆ దేశం. లాహోర్, ఇస్లామాబాద్, ఫైసలాబాద్, ముల్తాన్, సియాల్కోట్ విమానాశ్రయాల్లో జాతీయ, అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేసింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని జియో న్యూస్ సంస్థ తెలిపింది.
విద్యాలయాల మూసివేత
నియంత్రణ రేఖకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని విద్యాసంస్థలను మూసివేస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ విశ్వవిద్యాలయాలను మూసివేసింది ఇమ్రాన్ ప్రభుత్వం.
మరిన్ని వివరాలకు ఇవీ చూడండి: