పుల్వామా ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, వారికి సహాయ, సహకారాలు అందించినవారు ముమ్మాటికీ శిక్షార్హులేనని స్పష్టం చేసింది.
పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన 'జైష్ ఏ మహమ్మద్' పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థేనని యూఎన్ భద్రతా మండలి పేర్కొంది.
"ఐక్యరాజ్యసమితి భద్రతామండలి పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఆత్మాహుతిదాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్ జవానులు మృతి చెందారు. మరి కొంత మంది క్షతగాత్రులయ్యారు. ఇది ఒక హేయమైన, పిరికిబంద చర్యగా పరిగణిస్తున్నాం. ఈ దాడికి బాధ్యులమని 'జైష్ ఏ మహమ్మద్' ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది." - ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రెస్‌నోట్
ప్రపంచ శాంతికి విఘాతం...
తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది అంతర్జాతీయ శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని యూఎన్ఎస్సీ పునరుద్ఘాటించింది.
"ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారు, వారికి ఆర్థిక, సహాయ సహకారాలు అందిస్తోన్న సంస్థలు శిక్షార్హులు. అంతర్జాతీయ చట్టాలు, భద్రతా మండలి తీర్మానాలను అనుసరించి ప్రపంచ దేశాలు ఉగ్రవాదం నిర్మూలనకు సహకరించాలి. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌కు అన్ని దేశాలు అండగా నిలవాలి" -ఐరాస భద్రతా మండలి
ముక్త కంఠంతో...
పుల్వామా దాడికి బాధ్యులైన జైష్ ఏ మహమ్మద్ సంస్థపై కఠిన చర్యలు చేపట్టాలని ఐరాస భద్రతా మండలి ముక్త కంఠంతో నినదించింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని గతంలో చైనాను భారత్ డిమాండ్ చేసినప్పటికీ సానుకూలంగా స్పందించలేదు. అయితే నిన్నటి సమావేశంలో చైనా సైతం మిగిలిన దేశాలతో గళం కలిపింది.