పుల్వామా ఘటన తరువాత దేశంలోని పలుప్రాంతాల్లో కశ్మీరీ విద్యార్థులపై దాడులు జరిగాయి. వీటిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పందించింది. కశ్మీరీ విద్యార్థులకు తగిన భద్రత కల్పించాలని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడరాదని స్పష్టం చేసింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్దేశం మేరకు యూజీసీ ఈ ఆదేశాలు జారీ చేసింది.
"అన్ని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో చదువుకుంటున్న కశ్మీర్ విద్యార్థులకు భద్రత కల్పించండి. వారిపై ఎటువంటి దాడులు జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. అదే విధంగా కళాశాలల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా శాంతి, భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోండి." -యూజీసీ
కశ్మీర్ విద్యార్థులపై దాడి...
మహారాష్ట్ర యవత్మాల్లోని ఓ కళాశాలలో కశ్మీరీ విద్యార్థులపై శివసేన యూత్ వింగ్ (యువసేన) కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే యూజీసీ ఈ తరహా ఆదేశాలు జారీ చేసింది.
"అలాగే స్వస్థలాలకు వెళ్లాలనుకునే కశ్మీర్ విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని యూజీసీ స్పష్టం చేసింది. విద్యార్థులు అధైర్య పడాల్సిన పనిలేదు. విద్యార్థుల కోసం ప్రభుత్వం వందలాది రూపాయలు ఖర్చు చేస్తోంది. వారికి తగిన రక్షణ కల్పిస్తాం." - ఆర్ సుబ్రహ్మణ్యం, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి
హోంశాఖ ఆదేశాలు...
కశ్మీర్ విద్యార్థులకు భద్రత కల్పించాలని ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.